కేసీయార్ వైఫల్యాల మీదే షర్మిల ఆశలు పెట్టుకున్నదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణాలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముద్ర చాలా ఎక్కువే ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన లాంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలో వచ్చినవే. ఇక ఉచిత విద్య, ఉచిత విద్యుతో, ఆరోగ్యశ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాల గురించి చెబితే ముందుగా వైఎస్సారే గుర్తుకొస్తారు. పైగా వైఎస్సార్ రాష్ట్ర విభజనకు నూరుశాతం వ్యతిరేకం.

వైఎస్సార్ ఉన్నంత వరకు కేసీయార్ ప్రత్యేక తెలంగాణా గురించి నోరెత్తితే ఒట్టు. అసెంబ్లీలో విజయరామారావు, హరీష్ రావు లాంటి నేతలు మాట్లాడినా వైఎస్ వాయించేసేవారు. దాంతో మళ్ళీ నోరెత్తే సాహసం చేసేవారు కాదు. అలాంటి వైఎస్ హఠాత్తుగా మరణించటంతో కేసీయార్ కు ధైర్యం వచ్చి ప్రత్యేక తెలంగాణా ఊపందుకుంది. 2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందే నీళ్ళు, ఉద్యోగాలు, ఉపాధి, ఆత్మగౌరవం అనే నినాదాలతో.

ఏ లక్ష్యంతో అయితే ప్రత్యేక తెలంగాణా వచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి. కేసీయార్ సీఎం అయి ఏడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేయలేదు. ఉపాధి అవకాశాలు ఎంతమందికి దక్కాయో దేవుడికే తెలియాలి. ఇక ఆత్మగౌరవం అన్న పదానికి అర్ధమే మారిపోయింది. ఇదే విషయాన్ని తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా ఉన్న జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తో పాటు అనేకమంది ఉద్యమకారులు కేసీయార్ ను తిడుతున్నారు.

ఉద్యమం పేరుతో జనాలను కేసీయార్ మోసం చేశారని కోదండరామ్ తో పాటు అనేకమంది తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలో కేసీయార్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీలు ఫెయిలయ్యాయనే చెప్పాలి. బీజేపీకి అంత సీన్ లేదనే అనుకోవాలి. ఇటువంటి నేపధ్యంలోనే కేసీయార్ వైఫల్యాల ఆధారంగానే రాజకీయ శూన్యతను భర్తీ చేయటం కోసమే షర్మిల వైఎస్సార్సీపీ తెలంగాణా అనే పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

మీడియాతో షర్మిల మాట్లాడుతూ తెలంగాణా వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఉచిత విద్య అందుతోందా ? వైద్యం అందుతోందా ? ఇళ్ళ పట్టాలు ఎంతమందికి అందాయి ? రైతులు సంతోషంగా ఉన్నారా ? అంటు ప్రశ్నించటం గమనార్హం. అంటే షర్మిల తన కొత్తపార్టీ అజెండా ఏమిటో చెప్పకనే చెప్పినట్లయ్యింది.