దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వంపై వివాదం రాజుకుంది. జయలలితకు తానే అసలైన వారసురాలినంటూ జైలు నుండి విడుదలైన వీకే శశికళ ప్రకటించారు. ఆమె చేసిన ప్రకటనతో తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో కలకలం మొదలైంది. జయకు తానే అసలైన వారుసురాలినని, పార్టీకి తాను శాశ్వాత ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ చేసిన ప్రకటన పార్టీలో గందరగోళానికి దారితీసింది. పార్టీ తనదేనని మొత్తం పార్టీని తన ఆధీనంలోకి తీసుకుంటానని శశికళ చేసిన ప్రకటనతో అధికారపార్టీలో టెన్షన్ మొదలైంది.
అక్రమాస్తుల ఆర్జన కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించిన శశికళ ఈమధ్యనే బెంగుళూరులోని పరప్పన జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. జైలులో ఉన్నపుడే కరోనా సోకటంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. తర్వాత క్వారంటైన్ లో భాగంగా బెంగుళూరు శివార్లలోని ఓ రెస్టారెంటులో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత సోమవారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి చెన్నైకి చేరుకున్నారు.
రిసార్ట్స్ లో బయలుదేరి చెన్నైకి చేరుకునేంత వరకు మధ్యదారిలో దాదాపు 30 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, జయమద్దతుదారుల కనిపించారు. వారితో ఒకచోట మాట్లాడుతు జయలలితకు తానే నిజమైన వారసురాలినని, పార్టీకి తాను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎవరుంటే వారే పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రవుతారు. ప్రతిపక్షంలో ఉంటే సర్వంసహా అధినేతగా చెలామణవుతారు.
ఈ కారణంగానే ముఖ్యమంత్రి పళనిస్వామి నుండి మంత్రులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా, పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా చిన్నమ్మ తన కారుకు పార్టీ జెండాను పెట్టుకునే తిరుగుతున్నారు. మొత్తానికి చిన్నమ్మ ఎంట్రీతో ఏఐఏడీఎంకేలో ముసలం పుట్టినట్లే అనుమానంగా ఉంది. ఆమె మేనల్లుడు శశికళ కోసమే అమ్మ మక్కళ్ళ మున్నెట్ర కజగం (ఏఎంఎంకే)పార్టీని పెట్టినా శశికళ మాత్రం ఏఐఏడీఎంకే తనదే అనే వాదన మొదలుపెట్టటం విచిత్రంగా ఉంది.
మొత్తానికి చిన్నమ్మ ఎంట్రీ కారణంగా తొందరలోనే పార్టీలో పెద్ద చీలిక ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏఐఏడీఎంకే బాగా బలహీనపడటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచేది కూడా అనుమానమే. ఇఫ్పటికప్పుడు పార్టీ ఎవరిదనే సాంకేతిక వివాదం తేలేదికాదు. దాంతో పార్టీ చిహ్నమైన రెండాకులు ఎవరికీ కాకుండా పోయే అవకాశం కూడా ఉంది.
సాంకేతికంగా పళనిస్వామి నేతృత్వంలోని వర్గానిదే అని తేలినా క్షేత్రస్ధాయిలో మాత్రం నేతలు, కార్యకర్తల్లో చీలిక ఖాయమని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏఐఏడీఎంకేలో మొదలైన ముసలం చివరకు డీఎంకేకు లాభించటం ఖాయమని తెలిసిపోతోంది. చూద్దాం ఏమి జరుగుతుందో.