జగన్ కేబినెట్ మంత్రుల్లో ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా .. సంచలన వ్యాఖ్యలతో పాలిటిక్స్‌ను హీటెక్కిస్తారనే పేరుంది. ముఖ్యంగా టీడీపీ నేతలపైనా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పైనా.. మాజీ మంత్రి దేవినేని ఉమా పైనా మంత్రి కొడాలి నాని దూకుడు సెపరేట్.. అనే టాక్ ఉంది. ఇటీవల మాజీ మంత్రి దేవినేనిపై కొడాలి చేసిన హాట్ కామెంట్లు.. విజయవాడలో సంచలనం సృష్టించడంతోపాటు.. రెండు రోజుల పాటు ఉద్రిక్తతలకు కూడా దారితీశాయి.
దీంతో కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదు. అయితే.. తాజాగా ఇదే విషయంపై అనంతపురం మాజీ ఎంపీ.. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు.. జేసీ పవన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని నోటిని ఫినాయిల్‌తో కడిగి.. శుభ్రం చేసినా..ఆయన నోటి నుంచి ఇంత కన్నా మంచి మాటలు వస్తాయని ఆశించలేం! అని పవన్ అనడం గమనార్హం. ఇక, వైసీపీ నాయకులపైనా జేసీ పవన్ విరుచుకుపడ్డారు. విపక్ష నేతలు, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఈ క్రమంలోనే దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఇక, కేంద్రం తాజాగా తీసుకువచ్చిన బడ్జెట్‌లో ఏపీకి జరిగిన నష్టానికి వైసీపీ ఎంపీలు బాధ్యత వహించాలని కూడా పవన్ డిమాండ్ చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని… మీడియా ముందుకు వచ్చి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తూతూ మంత్రంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్, మద్యం రేట్లు అధికంగా ఉన్నాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పవన్ మండిపడడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates