చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. పంచాయితి ఎన్నికల్లో అందరు నామినేషన్లు వేయాలన్నారు. ఏకగ్రీవాలకు ఎట్టిపరిస్ధితుల్లోను అంగీకరించేది లేదని హూంకరించారు. ఎన్ని గొడవలు జరిగినా, చివరకు బైండోవర్ కేసులు పడినా వెనక్కు తగ్గకుండా పోరాటాలు చేయండంటూ ఆదేశించారు. అంతా బాగానే ఉంది. నేతలకు, కార్యకర్తలకు ఇన్ని మాటలు చెబుతున్న చంద్రబాబు ఎక్కడ కూర్చున్నారు ?
ఎక్కడో హైదరాబాద్ లో తనింట్లో కూర్చుని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తనింట్లో తాను సేఫ్ గా కూర్చుని తమ్ముళ్ళని మాత్రం క్షేత్రస్ధాయిలోకి దిగి కొట్టుకుచావమంటే ఎవరైనా ఒప్పుకుంటారా ? నామినేషన్ల సమయంలో గొడవలు జరిగి టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పడితే అందులో నుండి బయటపడేది ఎలా ? పొరబాటున కార్యకర్తల్లో ఎవరినైనా జైలుకు పంపితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి ?
నేతలు, కార్యకర్తలు వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలంటే చంద్రబాబు కూర్చోవాల్సింది హైదరాబాద్ లోని తనింట్లో కాదు. తనింటి నుండి బయటకు వచ్చి చంద్రబాబు జిల్లాల్లో పర్యటించాలి. ఒకవైపు తాను పర్యటిస్తుంటే మరోవైపు చినబాబు లోకేష్ ను మరికొన్ని జిల్లాలకు పంపాలి. అధికారపార్టీ వాళ్ళు తమ్ముళ్ళను అడ్డుకుంటే అప్పుడేమైనా గొడవలు జరిగితే తండ్రి, కొడుకులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి తమ్ముళ్ళు, కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యం వస్తుంది.
అలా కాకుండా తాము మాత్రం సేఫ్ గా ఉండాలి తమ్ముళ్ళు, కార్యకర్తలు మాత్రం ప్రత్యర్ధులతో గొడవలు పడి కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడాలంటే అది జరిగే పనికాదు. అందుకనే చంద్రబాబు ఎంత చెప్పినా చాలామంది తమ్ముళ్ళు పంచాయితి ఎన్నికల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. ఎందుకంటే నేతలు ఎవరిని ప్రోత్సహించి రంగంలోకి దింపినా ఎన్నికలయ్యే ఖర్చును ఎవరు భరించాలి ? తర్వాత పడే కేసుల్లో ఎవరు పోరాడాలి ?
నిజానికి ఇపుడు పంచాయితి ఎన్నికల్లో నామినేషన్లు వేయాల్సిన అవసరం కార్యకర్తలకో లేకపోతే దిగువస్ధాయి నేతలకు ఏమాత్రం ఇంట్రస్టు లేదు. ఎందుకంటే ఇపుడు ఎన్నికలకు దిగి లేకపోతే గెలిచినా మళ్ళీ ఏపని కావాలన్నా అధికారపార్టీ నేతల దగ్గరకే వెళ్ళాలన్న విషయం అందరికీ తెలిసిందే. పంచాయితీలు ఏకగ్రీవం కాకుండా అడ్డకోవటం, ఎన్నికలు జరగటం చంద్రబాబుకు మాత్రమే అవసరం. ఎక్కడో కూర్చుని ఆదేశాలు ఇస్తే క్షేత్రస్ధాయిలో పనులు జరగవు కాబట్టే చాలామంది నేతలు చంద్రబాబును లైటుగా తీసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates