తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యేనా ?

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు మొండిచెయ్యే కనబడింది. మొదటినుండి కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు పెద్దపీట వేసింది ఎప్పుడూ లేదు. యధావిధిగా ఇపుడు కూడా అదే జరిగింది. బెంగుళూరు, కేరళ, చెన్నై లో మెట్రో రైలు ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం మరి హైదరాబాద్, విశాఖపట్నం మెట్రా ప్రాజెక్టులకు మాత్రం ఎందుకని నిధులు కేటాయించలేదు ?

మెట్రో ప్రాజెక్టలనే కాదు చివరకు కొత్త రైలు మార్గాలు, పనులు జరుగుతున్న రైల్వే లైన్లకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. అంటే మెట్రోలు లేకపోతే రైల్వేలైననే కాదు పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేదా తెలంగాణాలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చమని కేసీయార్ ఎప్పటి నుండో అడుగుతున్నారు. అసలు వీటి ఊసేలేదు.

ఇక ఏపికి ప్రత్యేకహోదా ప్రకటించాల్సిందే అని వైసీపీ ఎంపిలు డిమాండ్ చేశారు. దీనిగురించి కేంద్రమంత్రి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీరు అడిగినట్లు నటించండి మేము విననట్లే నటిస్తామన్న పద్దతిలో జరిగిపోతోంది కేంద్రప్రభుత్వ-వైసీపీ ఎంపిల వ్యవహారమంతా. ఇటువంటి వ్యవహారాల వల్ల ఎంపిలకు, పార్టీలకు జరిగే నష్టం లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. టీడీపీ హయాంలో ఏమి జరిగిందో అందరు చూసిందే.

మొత్తం మీద ఏపి నుండి కొంతకాలం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపి అవసరాలేమిటో బాగా తెలుసు. అయినా బడ్జెట్లో కనీసం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదంటే కేంద్రానికి తెలుగు రాష్ట్రాలంటే ఎంత చిన్న చూపుందో అర్ధమైపోతోంది.