ఔను! ఎంత బిజీగా ఉన్నా.. తనకు ఇబ్బందిలేదు.. అనుకున్నా.. తన సొంత జిల్లా చిత్తూరుపై టీడీపీ అధినే త చంద్రబాబు దృష్టి పెట్టాలని అంటున్నారు పరిశీలకులు. నానాటికీ తీసికట్టుగా మారుతున్న చిత్తూరు టీడీపీ వ్యవహారం.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరింత పలచనైంది!
టీడీపీ అధినేత గా కంటే.. తన సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి ఇలా ఉందనేది బాబుకు మింగుడుపడని విషయమే!! ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల తొలి దశకు ఆదివారంతో నామినేషన్ల ఘట్టం పూర్తవుతోంది. అయితే.. చంద్రబాబు ఆశించిన విధంగా ఈ ప్రక్రియలో తమ్ముళ్లు దూకుడు చూపించలేదు.
వాస్తవానికి చంద్రబాబు హయాంలో టీడీపీ పుంజుకున్నది లేదు. పైగా చాలా వరకు నియోజకవర్గాల్లో నాయ కులు కూడా కరువయ్యారు. ఉదాహరణకు చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లో ఎవరు పార్టీలో ఉన్నారో.. ఎవరు లేరో..కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక, బాబు సొంత నియోజక వర్గం కుప్పంలో గడిచిన ఆరు మాసాల్లో పరిస్థితి అనూహ్యమలుపు తిరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి కనుసన్నల్లో ఇక్కడ టీడీపీ శ్రేణులను వైసీపీలోకి తీసుకున్నారు. అదేసమయంలో మినీ మునిసి పాలిటీగా గుర్తించారు. దీంతో చంద్రబాబు సానుకూలత ఉన్నా.. వైసీపీ డామినేషన్ ఎక్కువగా ఉండడం గమనార్హం.
కుప్పం నియోజకవర్గంలోకూడా ఇప్పటి వరకు ఆశించిన విధంగా నామినేషన్లు పడలేదు. వాస్తవానికి 2013 కంటే ఎక్కువ స్థానాల్లో టీడీపీ శ్రేణులు నామినేషన్లు వేసి గెలవాలని చంద్రబాబు ఆశించారు. అయితే.. ఇప్పటి వరకు ఆశించిన విధంగా అభ్యర్థులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు చూస్తే.. తొలి దశ ఎన్నికలకు చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోని 20 మండలాల్లో ఉన్న 454 సర్పంచి స్థానాలకు 157, 4142 వార్డు స్థానాలకు 105 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కార్వేటినగరంలో 25, అత్యల్పంగా పాలసముద్రంలో రెండు నామినేషన్లు సర్పంచి స్థానాలకు దాఖలయ్యాయి.
చిత్తూరు, నగరి, పుత్తూరు, నిండ్ర, పెనుమూరు, రామచంద్రాపురం, వడమాలపేట, గుడిపాల మండలాల్లో వార్డు మెంబర్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీనిని బట్టి.. బాబు సొంత జిల్లా, సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.