ఈ సర్ మాకొద్దు బాబోయ్

కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌(స‌ర్‌)పై దేశంలోని ప‌లు రాష్ట్రాలు అభ్యంత‌రం తెలిపిన విష‌యం తెలిసిందే. ఆయారాష్ట్రాల్లో త‌మ సానుకూల ఓట్ల‌ను తీసేస్తున్నార‌ని తెలంగాణ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అధికార పార్టీ నాయ‌కులు కూడా రోడ్డెక్కి ధ‌ర్నాలు చేశారు. కానీ, ఇంత‌కు మించి.. ఎవ‌రూ ఏమీ చేయ‌లేదు. కొంద‌రు స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు మాత్రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుప్రీంకోర్టు స‌ర్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్థించింది. అయితే.. దీనిలో జ‌రుగుతున్న లోపాల‌ను మాత్రం స‌రిదిద్దుకోవాల‌ని కోరింది.

అయితే.. తాజాగా దేశంలో ఒకే ఒక రాష్ట్రం అస‌లు స‌ర్ ప్ర‌క్రియ‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని, ఇది త‌మ‌కు వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. అదే.. ఢిల్లీకి చేరువ‌లో ఉండే జార్ఖండ్ రాష్ట్రం. తాజాగా బుధ‌వారం అసెంబ్లీని ప్ర‌త్యేకంగా స‌మావేశ ప‌రిచి మ‌రీ.. స‌ర్‌కు వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు.

ఇక్క‌డ జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) పార్టీ అధికారంలో ఉండ‌గా.. కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అంశంపై చర్చ జరిగింది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేసి, పారదర్శక మార్గదర్శకాలతో మళ్లీ చేపట్టాలని తీర్మానంలో కోరారు. విధానపరమైన సంక్లిష్టతలు, సాంకేతిక లోపాల వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని జార్ఖండ్ మంత్రి రాధాకృష్ణ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2.21 కోట్ల ఓటర్లలో 27 శాతం మందిని అనుమానాస్పదంగా గుర్తించి నోటీసులు పంపారని తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం అర్హతగల ఓటరుకు లభించే సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఏ ప్రక్రియ ద్వారా కూడా కోల్పోకూడదని తీర్మానం స్పష్టం చేసింది. తీర్మానం అయితే చేశారు. దీనిని గ‌వ‌ర్న‌ర్ ఆమోదించాలి. అనంతరం.. రాష్ట్ర‌ప‌తికి పంపాలి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.