ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుగా పనిచేస్తున్నారని, ఈ స్పీడు చూస్తే.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు అనుకున్న సమయానికంటే కూడా ముందే పూర్తయి పోతాయన్న నమ్మకం కలుగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తాజాగా బుధవారం.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు. రాజధాని పనులను వారునిశితంగా పరిశీలించారు. ఈ రెండు బ్యాంకులు కూడా రాజధానికి వేల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్ డీఏ) అధికారులతో బ్యాంక్ ప్రతినిధుల బృందం రాయపూడిలో పర్యటించింది. అమరావతిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు పురోగతిపై చర్చించారు. అలానే.. మారుతున్న ప్లాన్‌కు అనుగుణంగా చేపడుతున్న పనులను కూడా పరిశీలించింది. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కార్యక్రమాల అమలుకు సంబంధించిన సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణ, లేబర్ క్యాంపులలో కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాలను ఈ బృందం ఆరా తీసింది.
కమ్యూనికేషన్ ప్లాన్, సమస్యల పరిష్కార వేదిక, రాజధాని రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, రాజధాని ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలు పురోగతిని ప్రతినిధుల బృందం సమీక్షించింది. ఆయా కార్యక్రమాల అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించి పలు సూచనలను బ్యాంక్‌ల బృందం వెల్లడించింది. అనంతరం బ్యాంక్‌ల బృందం వైకుంఠపురం పంపింగ్ స్టేషన్, అమరావతిలో రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలు, కృష్ణా కరకట్ట రహదారి, మందడం పంచాయితీలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా.. సీఎం చంద్రబాబు బాగా కృషి చేస్తున్నారని.. అనుకున్న సమయం కంటే కూడా ముందుగానే ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు చెరో 15 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని రుణంగా అందిస్తున్నాయి. ఇప్పటికే దీనిలో 22 వేల కోట్ల మేరకురాష్ట్రానికి చేరింది. మరో 15 వేల కోట్లనురుణంగా తీసుకోవాలని సీఎంచంద్రబాబు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈవిషయంపైనే పరిశీలన జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates