ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచలన రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్.. స్వల్పకాలంలోనే 10 లక్షల మంది సభ్యులకు చేరువ అయింది. ఈ మొబైల్ యాప్‌లో నమోదైన సభ్యుల సంఖ్య 10 లక్షల మైలురాయిని దాటిందని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. యాప్‌లో 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, సభ్యులు చేరినట్లు పార్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా పార్టీ నేతల ప్రకటనల మేరకు, కార్యకర్తల అంకితభావానికి ఇది నిదర్శనమని టీడీపీ పేర్కొనగా, మంత్రి నారా లోకేశ్ సీఎం చంద్రబాబు సభ్యులకు అభినందనలు తెలిపారు.
పార్టీకి, కార్యకర్తలకు మధ్య డిజిటల్ అనుసంధాన వేదికగా ఈ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మధ్య డిజిటల్ వారధి ఏర్పాటు చేశారు. అధికారిక మొబైల్ అప్లికేషన్ ద్వారా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, సమాచారాన్ని వేగంగా చేరవేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ యాప్ ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు సహా ముఖ్య నాయకుల రోజువారీ పర్యటనలు, సభలు, సమావేశాలు, ప్రసంగాలు, ముఖ్య సందేశాలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోవచ్చు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులతో కనెక్ట్ అవ్వడానికి, పార్టీ విషయాలపై చర్చించడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. స్థానికంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాలు, ర్యాలీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కార్యకర్తలు నేరుగా యాప్‌లో అప్‌లోడ్ చేసి, ఇతరులతో పంచుకోవచ్చు.
అంతేకాదు.. కీలకమైన పార్టీ సభ్యత్వానికికూడా ఈ యాప్ ఉపయోగపడుతోంది. ఇక, ప్రజలకు ప్రభుత్వ పథకాల సమాచారం కూడా ఈ యాప్ ద్వారానే అందుతోంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ యాప్‌లో ప్రకటనలు, తేదీలు సహా అన్ని విషయాలను వివరించేలా వీడియోలు ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates