ఓటు వేయడానికి మీరు కారం పొట్లాలతో రండి

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొంతమంది నాయకుల మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఏ ఒక్క పార్టీ అతీతం కాదనే చెప్పాలి. ఎన్నికలు అనేది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఇందులో భాగంగా ఇదేళ్లకోసారి తమ ప్రతినిధిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా కలిసి మెలిసే వుంటారు.

ఆ మాత్రం దానికి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేయడం, అందుకు అడ్డదారులు తొక్కేందుకు సైతం వెనకాడక పోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు డాక్టర్ శ్రీనివాస రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. 

నరసరావుపేట పేట మున్సిపాలిటీకి ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన శ్రీనివాస రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లేటప్పుడు చీర కొంగుల్లో కారం పొట్లాలు పెట్టుకోవాలని మహిళా కార్యకర్తలకు సూచించారు. పోలింగ్ సమయంలో ఎవరైనా అడ్డుకోవడానికి కానీ బెదిరించడానికి ప్రయత్నిస్తే వారిపై కారం చల్లి దాడి చేయాలని చెప్పారు. వారికి తాను అండగా ఉంటానని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. 

ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు, ఫలితాలను తారుమారు చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. నామినేషన్ల సమయంలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, పరిశీలనలో పత్రాలను తిరస్కరించేలా చూడటం వంటి చర్యలకు టీడీపీ పాల్పడిందని విమర్శించారు. పోలింగ్ రోజు వైసీపీ సానుభూతిపరులు ఓట్లు వేయకుండా కుట్రలు చేస్తుందన్న ఆయన కారం పొట్లాలతో వారికి జవాబు చెప్పాలని వ్యాఖ్యనించారు. 

శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు పల్నాడులో ఏదో జరగబోతుందన్న సంకేతాలు ఇస్తున్నాయని, ప్రజల్ని భయాందోళనకు గురి చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలడం చేతకాక ఓటమికి సాకులు వెదుకుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేశారు. కారం పొట్లాలతో పోలింగ్కు వెళ్లమని చెప్పడం ద్వారా మహిళల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మీరు కారం పొట్లాలతో రండి, మేము కుంకుమ పొట్లాలు తీసుకొస్తామని టీడీపీ నాయకులు చెప్పడం వైరల్ అవుతోంది.