పెరిగిపోతున్న ‘జనవరి 26’ టెన్షన్

ఒకవైపు జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవ ఏర్పాట్లు. మరోవైపు అదేరోజు వేలాది ట్రాక్టర్లతో మూడు వ్యవసాయ చట్టాలపై నిరసన ప్రదర్శనకు నిర్ణయం. దీంతో 26వ తేదీన ఢిల్లీలో ఏమి జరగబోతోందో అర్ధంకాక మామూలు జనాలకు టెన్షన్ పెరిగిపోతోంది. కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో గడచిన రెండు నెలలుగా ఢిల్లీ శివార్లలోని సింఘూ దగ్గర వేలాదిమంది రైతులు చేస్తున్న ఉద్యమం అందరికీ తెలిసిందే.

చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు సాధ్యంకాదని కేంద్రప్రభుత్వం ఎవరి వాదనకు వాళ్ళే కట్టుబడున్నారు. సరే కేంద్రంపై అన్నీవైపులా పెరిగిపోతున్న ఒత్తిడి తలొంచి చివరకు ఏడాదిన్నరపాటు చట్టాల అమలును నిలిపేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే రైతుసంఘలు ఏడాదిన్నరను వ్యతిరేకించాయి. ఏడాదిన్నర ఆపటం కాదని మొత్తానికే చట్టాలను రద్దు చేయాలని పట్టుపట్టాయి. దాంతో 11వ విడత చర్చలు కూడా ఫెయిలయ్యాయి.

చర్చలు విఫలమవ్వటంతో ముందుగానే అనుకున్నట్లుగా రైతుసంఘాలు ఢిల్లీలో 26వ తేదీన వేలాది ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శనకు రెడీ అయిపోతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, మహారాష్ట్ర నుండి ఇప్పటికే దాదాపు లక్ష ట్రాక్టర్లు సింఘూ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. రైతుసంఘాల వైఖరి చూస్తుంటే ట్రాక్టర్ల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోయినా ఢిల్లీలోకి చొచ్చుకునే వెళ్ళేట్లే కనబడుతున్నాయి.

అదే జరిగితే సరిహద్దుల్లో పెద్దఎత్తున ఘర్షణలు తప్పేట్లులేదు. అప్పుడు కేంద్రప్రభుత్వానికి చెడ్డపేరు రావటం ఖాయం. ఇప్పటికే ఈ విషయాన్ని సుప్రింకోర్టు పరిశీలించింది. ట్రాక్టర్ల ర్యాలీ అంశం తమకు సంబంధం లేదని దాన్ని ఢిల్లీ పోలీసులు చూసుకోవాలని చెప్పేసింది. మరి ఈ పరిస్ధితుల్లో ఢిల్లీ పోలీసులు ఏమి చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. మొత్తంమీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి నరేంద్రమోడి మాత్రమే. మోడి ఏమో చట్టాలను అమలు చేయాల్సిందే అని తెగేసి చెప్పేశారు. దాంతో ఇఫుడు 26వ తేదీ టెన్షన్ పెరిగిపోతోంది.