‘నేనున్నాను.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుందాం’

ముర‌సు తుఫాను ప్ర‌భావంతో ఏపీలోని ప‌లు జిల్లాలు అత‌లాకుత‌లం అయ్యాయి. రాజ‌ధాని అమ‌రావతికి చేరువగా ఉన్న బాప‌ట్ల‌, ఎన్టీఆర్‌, కృష్ణా, ప్ర‌కారం, మార్కాపురం జిల్లాల్లో తుఫాను ప్ర‌భావం తీవ్రంగా క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధ‌వారం ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం… ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు.

భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని… ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు. ఈ సంద‌ర్భంగా నేనున్నాను.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుందాం.. అని ప్ర‌ధాని భ‌రోసా ఇచ్చారు.

చంద్ర‌బాబు స‌మీక్ష‌లు..

ఆర్నబ్, మురసు తుఫాన్లలో పంటలు నష్ట పోయిన రైతులకు అండగా నిలిచేేందుకు సీఎం చంద్రబాబు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకునేలా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. రైతుల కష్టాలు, సమస్యలపై కేంద్రానికి లేఖలు రాయటంతో పాటు పలు మార్లు కేంద్ర మంత్రులతో మాట్లాడిన సీఎం.. ఏపీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇప్పటికే నాలుగు సార్లు మాట్లాడి కేంద్ర బృందాలను వెంటనే రప్పించారు.

ఆర్నబ్ కారణంగా రూ.4563 కోట్ల మేర రాష్ట్రానికి నష్టం వాటిల్లినట్టు ఇప్పటికే ప్రాథమిక నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంభ‌వించిన ముర‌సు తుఫాను కార‌ణంగా.. 3 వేల కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లిన‌ట్టు పేర్కొంది. 781 గ్రామాలు ఆర్నబ్ తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. 16 జిల్లాల్లో 3 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలు, 13.6 వేల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడింది. ఇక‌, ముర‌సు తుఫాను కార‌ణంగా.. 400 గ్రామాల్లో ప్ర‌భావం ప‌డిన‌ట్టు వివ‌రించింది.