ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారు.. ఆర్భాటాలు వ‌ద్దు..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూట‌మి పార్టీలు ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కూట‌మి పార్టీలే విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చూపిన చొర‌వ‌, కూట‌మిని ఆశీర్వ‌దించిన తీరు త‌మ ప్ర‌భుత్వానికి మ‌రింత బాధ్య‌త‌ను పెంచింద‌న్నారు. మేం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. ఇదే నా ప్రాధాన్యత. అని వ్యాఖ్యానించారు. వ‌చ్చే 2029 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హాలో తీర్పు ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

రాజకీయమా.. ప్రజల సమస్యల పరిష్కారమా అంటే నేను సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తాను. మూడు రోజుల పాటు నేను తుఫాన్ సహాయక చర్యలపైనే రాత్రింబవళ్లు పనిచేశాను. అనునిత్యం ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు పనిచేశాం.. దీన్ని చూసే ప్రజలు ఓటేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వెలిగొండ ద్వారా నీటిని అందించాం. అమరావతి పనులు పరుగులు పెట్టిస్తున్నాం. గతంలో రోడ్లను ధ్వంసం చేశారు… మేం రోడ్లేశాం. అన్ని పనులు చేసేశామని చెప్పడం లేదు.. వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా ఉన్నాయి. ప్రజలు ఇదే విధంగా కూటమిని ఆశీర్వదించాలి… సహకరించాలి. అని చంద్ర‌బాబు సూచించారు.

కూట‌మి మంచి పాలన అందిస్తున్నాం కాబట్టే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసనీయత ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్రజలకు సేవలందించే విషయంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటున్నామ‌ని తెలిపారు. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి... ప్రజలకు ఇబ్బందులను దూరం చేసేలా పాలన అందిస్తున్నాం. అని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, అధికార పార్టీకి ఓటేయని వారుంటారని, లబ్దిపొందే వాళ్లు కూడా ఎగతాళి చేసే వారుంటారని అన్నారు. ఇలాంటవి ఉన్నా వాటిని పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామ‌ని తెలిపారు.

ఆర్భాటాలు వ‌ద్దు..

రాష్ట్ర వ్యాప్తంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్న నేప‌థ్యంలో చాలా చోట్ల నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిని ప్ర‌స్తావిస్తూ.. ఆర్భాటాలు వ‌ద్ద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్న‌బ్ స‌హా ముర‌సు తుఫాను ప్ర‌భావం ఉంద‌ని.. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నార‌ని.. రోజు వారి ప‌నుల‌పై ఆధార‌ప‌డిన వారికి ప‌నులు లేకుం డా పోయాయ‌ని.. అలానే లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు కూడా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. వీరిని ఆదుకునేందుకు గెలిచిన నాయ‌కులు, అదే విధంగా పార్టీల కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌న్నారు. ప‌రిస్థితులు స‌ర్దుమ‌ణిగిన త‌ర్వాతే.. సంబ‌రాలు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.