ప్రధాని మోడీ మెడలు వంచుతామని.. ఆయనను గద్దె నుంచి దింపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేపట్టిన భారీ నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపైనా.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌పైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఓట్లను తొలగించి.. కేంద్ర ప్రభుత్వాన్ని జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లను తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లకు ఎసరు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మోడీని గద్దె దించేందుకే ఈ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను వానర సైన్యంతో పోల్చారు. “నా వానర సైన్యంతో గర్జిస్తా.. మోడీ తలవంచక తప్పదు, మోడీ మెడలు వంచుతాం” అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాడు లంకా దహనానికి వానర సైన్యం వచ్చినట్టుగా ఇప్పుడు మేమంతా వచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మోడీ కుర్చీని కాపాడేందుకు.. మరో 20 కోట్లమంది పేదల ఓట్లను తొలగించేందుకు జ్ఞానేష్ కుమార్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పేదల ఓట్లు తొలగించి.. తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం సాగనివ్వబోమని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో భారీ భద్రత..
కాంగ్రెస్ నిరసన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీని అష్టదిగ్భంధం చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మెట్రో సహా ప్రజారవాణాపై ఎలాంటి నిర్బంధాలు విధించకపోయినా.. ఎక్కడికక్కడ నిరసన కారులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నగరం మొత్తం ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను తీసుకువచ్చారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా 10 వేల మందికిపైగా పోలీసులను మోహరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates