పులివెందులలో జరుగుతున్న స్థానిక ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన జగన్‌కు అడుగడుగునా పరాభవాలు ఎదురయ్యాయి. ఆయన అడుగు పెట్టీ పెట్టడంతోనే తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఎదురొచ్చారు. నీవల్లే మాజీవితాలు నాశనం అయ్యాయంటూ.. ఆక్రోశించారు. వైఎస్ వివేకాను స్వయంగా జగనే చంపించాడని ఆరోపించారు. అనంతరం.. పులివెందులలో ఎన్నికల అధికారులు కూడా జగన్‌ను అడ్డుకున్నారు.
తమ పార్టీ ఏజెంట్లు 80 మంది ఉంటే వారిని లోపలికి కూడా అడుగు పెట్టకుండా ఎన్నికల క్రతువును చేపట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ వాళ్లే రిగ్గింగ్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ కూడా అధికారులు ఆయనను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో గంటకుపైగానే జగన్ రోడ్డుపై బైఠాయించారు. సుమారు 100 మంది కార్యకర్తలతో రోడ్డుపైనే కూర్చున్న జగన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు పోలింగ్‌కు వచ్చిన జనాలను పోలీసులు సురక్షితంగా బూతులకు తీసుకువెళ్లి ఓటు వేయించారు.
మొత్తంగా పులివెందుల పర్యటనలో తొలిసారి జగన్‌కు పరాభవం ఎదురైంది. ఈ పరిణామాలపై స్పందించిన జగన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాడులు చేయడం తమకు తెలియదా? అని ప్రశ్నించారు. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తమ వారు దాడులు చేస్తారని.. కానీ, అలా చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏజెంట్లు లేకుండా ప్రజాస్వామ్యంలో ఓటు వేసే పద్ధతి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిదాడి చేయడం పెద్ద పనికాదన్న ఆయన.. కానీ, వాటిని తాను అంగీకరించనన్నారు.
ఎన్నికలను సజావుగా జరిపే ధైర్యం చంద్రబాబుకు లేదని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఆయన ఖూనీ చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో ఉన్నారని.. ఈ విషయం ఆయనకు తెలిసింది కాబట్టే ఇలా అడ్డంకులు సృష్టించి తన వారితో ఓట్లు వేయించుకునేందుకు వైసీపీకి ఏజెంట్లు కూడా రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేస్తున్నరని విమర్శించారు. పోలింగ్ బూత్‌లోకి ఏజెంట్లను రాకుండా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates