ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే.. ఒక విషాదం చోటు చేసుకోగా.. మరిన్ని చోట్ల అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఒక పార్టీ అభ్యర్థికి ఎదురుగా మరో పార్టీ అభ్యర్థి ఎన్నికల గుర్తు కేటాయించారు. విజయవాడ 55వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందు వైసీపీ అభ్యర్థి ఓటును కేటాయించారు. అలాగే.. వైసీపీ అభ్యర్థి ఓటు ముందు.. హస్తం గుర్తును కేటాయించారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియను దాదాపు 2 గంటలపాటు వాయిదావేశారు.
అనకాపల్లి జిల్లాలోని పలువార్డుల్లో టీడీపీ అభ్యర్థుల ఓటు ముందు వైసీపీ అభ్యర్థి పేరును రాయగా.. వైసీపీ అభ్యర్థి ఎన్నికల గుర్తు ముందు హస్తం గుర్తును ముద్రించారు. దీంతో ఇక్కడ కూడా ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామాలపై అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. అయితే.. వాయిదా వేసిన ఎన్నికల ప్రక్రియను ఎప్పుడు చేపడతారన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. కొత్తగా తిరిగి బ్యాలెట్లు ముద్రించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. అయితే.. అభ్యర్థులు మాత్రం ఎన్నికల అధికారులపై నిప్పులు చెరిగారు.
చివరి నిముషంలో హ్యాండ్!
కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు-2 ఎంపీటీసీ అభ్యర్థి హిమబిందు చివరి నిమిషంలో వైసీపీకి హ్యాండిచ్చారు. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొన్నేళ్లుగా గుండె సంబంధిత చికిత్స జరుగుతోందని, ఇటీవల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో గుండెనొప్పి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపారు. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
తీవ్ర విషాదం..
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నూజివీడు పట్టణంలోని 30వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోటగిరి పూర్ణిమ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి సతీష్ (53) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి అరగంట ముందు అంటే.. ఉదయం 6.30 గంటల సమయంలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates