4600 కోట్ల న‌ష్టం… వారిపైనే బాబు ఆశ‌లు

ఆర్న‌బ్ తుపాను చేసిన న‌ష్టం.. తీసుకువ‌చ్చిన క‌ష్టం తాలూకు విలువ 4600 కోట్ల రూపాయ‌లుగా సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ మేర‌కు కేంద్రం త‌మ‌ను ఆదుకోవాల‌ని ఇప్పటికే ఆయ‌న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కు లేఖ రాశారు. ఫోన్ చేసి మాట్లాడారు. ఆదుకుంటామ‌ని అమిత్‌షాకూడా హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్రం నుంచి ప్ర‌త్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించారు. ఈ బృందం శ‌నివారం ఉద‌యం అమ‌రావ‌తికి చేరుకుంది. అనంత‌రం ఆర్న‌బ్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న చేయ‌నుంది.

కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి చిత్త‌రంజ‌న్ దాస్ నేతృత్వంలో రాష్ట్రానికి వ‌చ్చిన ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన కేంద్ర బృందం తొలుత అమ‌రావ‌తికి చేరుకుంది. ఆర్టీజీఎస్‌కు చేరుకున్న కేంద్ర బృందం స‌భ్యులు రాష్ట్రంలో అర్న‌బ్ తుపాన్ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టంపై ఆరా తీయ‌నున్నారు. కేంద్ర బృందానికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా ఆర్టీజీ కార్య‌ద‌ర్శి కాటంనేని భాస్క‌ర్‌, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్ లు వివ‌రించారు. ఫొటోలు, వీడియోలు స‌హా బాధితుల స‌మ‌స్య‌ల‌ను వారికి వివ‌రించారు.

అనంత‌రం.. క్షేత్ర‌స్థాయిలో ఈ కేంద్ర బృందం రెండు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నుంది. అనంత‌రం.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోనూ భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత‌.. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం నుంచి నిధులు అంద నున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న పరిస్థితిలో కేంద్రం నుంచి అందే సాయంపైనే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధార‌ప‌డింది. దీని నుంచే బాధితుల‌కు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సీఎం కూడా తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో తాము ప్ర‌క‌టించిన 4600 కోట్ల‌లో క‌నీసం 4000 కోట్ల రూపాయ‌లైనా ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఏం చేస్తారు?

గ‌త ఏడాది కూడా రాష్ట్రానికి వ‌ర‌ద‌లు, తుఫానులువ చ్చాయి. ఆ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు 2500 కోట్ల రూపాయ‌ల మేర‌కు రాష్ట్రానికి న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు. అయితే.. అప్ప‌ట్లో విప‌త్తు స‌హాయ నిధి కింద తాము మంజూరు చేసిన 1800 కోట్ల రూపాయ‌లు స‌ర్కారు వ‌ద్దే ఉన్నాయ‌ని.. ఆ నిధుల‌ను వాడుకోవాల‌ని కేంద్రం స‌ల‌హా ఇచ్చింది. ఆ త‌ర్వాత‌.. ఈ విష‌యాన్ని అంద‌రూ వ‌దిలేశారు. ఇక‌, ఇప్పుడు కూడా గ‌త నెల‌లోనే కేంద్రం అన్ని రాష్ట్రాల‌కు విప‌త్తు స‌హాయ నిధిని మంజూరు చేసింది. దీని ప్ర‌కారం.. ఏపీకి 3 వేల కోట్లు, తెలంగాణ‌కు 2200 కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చింది. ఆ నిధుల నుంచే ఇప్పుడు కూడా ఖర్చు చేయాల‌ని చెబుతారా? లేక‌.. ప్ర‌త్యేక నిధులు ఇస్తారా? అనేది చూడాలి.