రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి తర్వాత బైక్ పై పారిపోతున్న నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చివరకు ధర్మవరం రైల్వే స్టేషన్ లో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడిని అక్కయ్యవారిపాలెం గ్రామానికి చెందిన యువకుడు హేమంత్ గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడి తల్లిదండ్రులు చనిపోగా అక్క దగ్గర ఉంటున్నాడని తెలుస్తోంది. బాధితురాలికి ఆ యువకుడు బంధువు అవుతాడని తెలుస్తోంది. అయితే, బాధిత బాలిక తన ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. కాగా, కుటుంబ తగాదాల నేపథ్యంలోనే బాలికపై దాడికి ఒడిగట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పోలీసులు అధికారికంగా కారణాలు వెల్లడించాల్సి ఉంది.
మరోవైపు, బాధిత బాలికను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాధిత బాలిక కుటుంబాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు.
బాధిత బాలిక అనంతపురం ఆసుపత్రికి వచ్చే సమయంలో పూర్తిగా బీపీ పడిపోయిందని, స్పృహ లేకుండా జీరో పల్స్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారని సత్య కుమార్ తెలిపారు. అక్కడి వైద్యులంతా తక్షణమే స్పందించి బాలికకు అత్యవసర చికిత్స అందించారని అన్నారు. ఆ తర్వాత బాలిక పరిస్థితి కాస్త మెరుగైందని, బీపీ 133/80కి వచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించామని తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో బాధిత బాలికపై దాడిని అడ్డుకోబోయిన క్రమంలో గాయపడ్డ బాలిక పరిస్థితి నిలకడగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates