యలహంక నాదే… కానీ కూతురు పెళ్లి అక్కడ చెయ్యను

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తనయురాలు అంజిలి పెళ్లి యలహంక ప్యాలెస్ లో జరపవద్దని వైఎస్ జగన్ కరాఖండిగా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. తాను పుట్టి పెరిగిన ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఉంది అని అంజిలి చెప్పినా సరే మేనమామ జగన్ మనసు కరగలేదని రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

అయినా సరే, జగన్ మాత్రం తన ఇంట్లో ఆ పెళ్లి వద్దు అని భద్రతా కారణాలు సాకుగా చూపిస్తున్నారు. ఇక, అది ఉమ్మడి ప్రాపర్టీ అని వైసీపీ నేతలు వాదిస్తుండగా…అది షర్మిల ప్రాపర్టీ అని విజయమ్మ కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై షర్మిల సంచలన ప్రకటన చేశారు. తన కూతురు అంజిలి వివాహ వేదికను యలహంక నుంచి వేరే చోటికి మార్చాలని నిర్ణయించామని ప్రకటించారు.

ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనది కానీ దానికోసం ఆశపడే నీచమైన మనస్తత్వం తనది కాదని ఆమె అన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం తన, తన పిల్లల భాగానికి వచ్చిందన్నది దైవ సాక్షిగా నిజం అని వెల్లడించారు.

అది తన బిడ్డల హక్కు అని, తన తండ్రి వైఎస్సార్ తిరిగిన ఇల్లు కాబట్టి తన కుమార్తె అంజిలి కోరినట్లుగా ఆమె వివాహం అక్కడ చేయాలనుకున్నామని అన్నారు. ఇలా తాను పెరిగిన ఇంట్లో తన పెళ్లి జరగాలి అనుకోవడం ప్రతి తెలుగింటి ఆడపిల్ల కల అని, తమ సొంత ఇంట్లో తమ బిడ్డ పెళ్లి చేయాలనుకోవడం ప్రతి తల్లిదండ్రుల అదృష్టమని చెప్పారు. కానీ, తన కూతురి ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నామని అన్నారు.

ఈ వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు షర్మిల. అయితే, అంజిలి పెళ్లి వివాద రహితంగా, గొడవలు లేకుండా జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. అందుకే, వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పెళ్లి వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నామని షర్మిల ప్రకటించారు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షించారు. తాజాగా షర్మిల ప్రకటనతో ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పడినట్లే.