నాయుడుకు రెన్యువ‌ల్ ఉంటుందా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ పోస్టులో ఉన్న ప్ర‌ముఖ మీడియా అధిప‌తి బీఆర్ నాయుడు ప‌రిస్థితి సందిగ్ధంలో ప‌డింది. ఏపీలో కూట‌మిస‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి బోర్డును కొత్త‌గా ఏర్పాటుచేసి రెండు సంవత్స‌రాలు అయింది. సాధార‌ణంగా ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు బోర్డును మార్చ‌డ‌మో.. లేక ఉన్న వారినే రెన్యువ‌ల్ చేసి.. మ‌రో ఏడాది పొడిగించ‌డ‌మో చేస్తారు. ఈ ద‌ఫా ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌స్తుతం ఉన్న పాల‌క మండ‌లి బోర్డు ప‌ద‌వీ కాలం అక్టోబ‌రు 31తో ముగిసోయింది. దీంతో ప్ర‌భుత్వం నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు.

గ‌త 2024 న‌వంబ‌రులో కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌గా టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. దీనిలో ప్ర‌ధానంగా చైర్మ‌న్ పోస్టుకు తీవ్ర‌స్థాయిలో పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. ముందుగా ఇచ్చిన హామీ మేర‌కు బీఆర్ నాయుడుకు చైర్మ‌న్ పోస్టును ఇచ్చిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. ఇక‌, ఈ బోర్డులో సుమారు 57 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో మంత్రులు కొలుసు పార్థ‌సార‌థి వంటి వారితోపాటు టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నేత‌లు కూడా చోటు సంపాయించుకున్నారు. అలానే.. ఓ ప్ర‌ముఖ‌ మీడియా సంస్థ‌కు చెందిన వ్య‌క్తులు కూడా అవ‌కాశం చేజిక్కించుకున్నారు. వీరు కాకుండా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు కూడా ఉన్నారు.

అయితే.. తాజాగా శ‌నివారంతో ఈబోర్డు గ‌డువు మీరుతోంది. రెండు సంవ‌త్స‌రాల కాలానికి మాత్ర‌మే బోర్డు చెల్లుబాటు అవుతుంది. ఈ నేప‌థ్యంలో బోర్డు చేసే ఏ సిఫార‌సులు శ‌నివారం అర్ధ‌రాత్రి త‌ర్వాత చెల్లుబాటు కావ‌ని.. కార్య‌నిర్వహ‌ణాధికారి(ఈవో) ముద్దాడ ర‌విచంద్ర ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు ఆర్న‌బ్ తుఫాను ఎఫెక్ట్ ప్రాంతాల‌పై దృష్టి పెట్టారు. ఇక్క‌డి రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను ఆదుకునే అంశాల‌పైనే ఆయ‌న ఎక్కువ‌గా దృష్టిసారించారు. దీనికితోడు ఆదివారం స‌హా.. త‌ర్వాత నెల‌లోనూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో బోర్డు కాల ప‌రిమితిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కొత్త బోర్డును ఏర్పాటు చేస్తారా? లేక ఉన్న‌దానినే రెన్యువ‌ల్ చేస్తారా? అనేది ప్ర‌శ్న‌.

నాయుడు చుట్టూ..

మ‌రీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు చుట్టూ చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో ఆయ‌న చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న మూడు మాసాల్లోనే 2025 జ‌న‌వ‌రిలో వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుప‌తిలోని క్యూలైన్ల‌లో తొక్కిస‌లాట జ‌రిగి ఏడుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత‌.. త‌ర‌చుగా పులులు, ఇత‌ర జంతువులు హ‌ల్చ‌ల్ చేయ‌డం కూడా వివాదానికి దారితీసింది. దీంతోపాటు అప్ప‌టి ఈవో శ్యామ‌ల‌రావుతో చైర్మ‌న్‌కు స‌రిప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. సీఎం చంద్ర‌బాబు చైర్మ‌న్‌ నాయుడును కొన‌సాగించా రు. ఇక‌, ఇప్పుడు ప‌దవీ కాలం అయిపోయిన ద‌రిమిలా.. ఆయ‌న విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇక‌, ప్ర‌స్తుతం స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారం డిసెంబ‌రు 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ద‌రిమిలా.. అప్ప‌టి వ‌ర‌కు బోర్డుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.