ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి వ‌ర్చువ‌ల్‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఆయ‌న వ‌రుస‌గా జిల్లాల వారీగా నాయ‌కుల‌తో మాట్లాడారు. ఆర్న‌బ్ తుఫాను అయిపోయింద‌ని.. ఇప్పుడు దానిని మించిన పోలింగ్ తుఫాను రానుంద‌ని ఆయ‌న చెప్పారు. ఆదివారం జ‌ర‌గ‌నున్న మునిసిపల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ఒక ర‌కంగా తుఫాను వంటిదేన‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ విష‌యంలో ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని అన్నారు. తుఫానును ఎదుర్కొనేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో.. అలానే ఇప్పుడు కూడా ఉండాల‌న్నారు.

మూడు అంచ‌లుగా..

మూడు అంచ‌లుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల‌కు సూచించారు. ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో పోలింగ్ బూతుల‌ను ఇంచార్జ్‌లు, అధికారులు అనుమ‌తి ఇచ్చిన వారు ప‌దే ప‌దే ప‌రిశీలించాల‌న్నారు. బూత్ ఆక్ర‌మ‌ణ‌లు, ఓట‌ర్ల‌ను బెదిరించ‌డం వంటివాటిని ఉదాశీనంగా తీసుకోవ‌ద్ద‌న్నారు. అవ‌స‌ర‌మైన ప‌రిస్థితిలో ఎదిరించాల‌ని సూచించారు. ప్ర‌తిఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. చిన్న విష‌య‌మే అయినా.. చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేయ‌వ‌ద్ద‌న్నారు. జిల్లాల్లో ముఖ్యంగా పోలింగ్ జ‌రిగే ప్రాంతాల్లో ఓట‌ర్ల‌ను అధికార వ‌ర్గాలు బెదిరించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. అలాంటి చోట ఓట‌ర్లు భ‌యంతో ఇంట్లోనే ఉండిపోతార‌ని.. కాబ‌ట్టి వారిని పోలింగ్ కేంద్రం వ‌ర‌కు తీసుకువెళ్లే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని సూచించారు.

  1. సీసీ కెమెరాలు: పోలింగ్ కేంద్రాల వ‌ద్ద సీసీకెమెరాలు ఉన్నాయో లేవో స‌రిచూసుకోవాల‌ని జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల‌కు, బూత్ ఏజెంట్ల‌కు కూడా సూచించారు. ఎక్క‌డైనా లోపాలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాల‌ని.. లేక‌పోతే మీడియా దృష్టికి తీసుకురావాల‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే.. మీ మీ సెల్ ఫోన్ల‌ల‌నే సీసీ కెమెరాలుగా మార్చి.. అన్ని విష‌యాల‌ను వీడియో తీయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు సూచించారు. అయితే.. పోలింగ్ జ‌రిగే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల‌నుప‌రిమితంగానే అనుమతించ‌నున్నారు. దీంతో సీసీ కెమెరాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ‌గ‌న్ సూచించారు.
  2. పార్టీ గెలుపు: ఈ ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచి తీరాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. “ఇది నా కోసం కాదు. మ‌న కోసం అనుకోండి` అని నాయ‌కుల‌కు సూచించారు. పార్టీ గెలిస్తేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌లోపేతం అవుతామ‌ని తేల్చి చెప్పారు. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించ వ‌ద్ద‌న్నారు. మిలాఖ‌త్ అయ్యే ప‌రిస్థితి అస‌లే ఉండ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. పార్టీ త‌ర‌ఫున పార్టీ కోసం ప‌నిచేసేవారినే బూత్ ఏజెంట్లుగా నియ‌మించాల‌ని ముఖ్య నాయ‌కుల‌కు జ‌గ‌న్ సూచించారు. టీడీపీ నేత‌ల ఆగ‌డాల‌కు చెక్ పెట్టాల‌ని.. పోలీసులు, కేసులు, లాఠీల‌కు భ‌య‌ప‌డితే ఎన్నిక‌లు స‌జావుగా సాగ‌బోవ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. తాను ప్ర‌తి క్షణం అందుబాటులోనే ఉంటాన‌ని పేర్కొన్నారు.