ఆర్నబ్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మొగల్తూరు సహా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అన్నదాతలను ఆప్యాయంగా పలకరించారు. కొందరు రైతులను దగ్గరకు చేర్చుకుని వారి భుజాలపై చేయి వేసి.. ముందుకు నడుస్తూ.. కష్టాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాల్లో పర్యటించారు. రైతులతో కలిసి ఒక్కొక్క అడుగు వేస్తూ.. వారి ఇబ్బందులు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి పొలం దగ్గర ఆగి.. దాని వివరాలు తెలుసుకున్నారు. అలానే.. ప్రాథమికంగా రైతుల నుంచి నష్టం వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఒక్క వారం ఆగితే పంట చేతికి అందేదని.. పూర్తిగా పక్వానికి వస్తున్న దశలో తుఫాను తమ ప్రాణం తీసిందని ఒక రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను ఓదార్చిన సీఎం.. పంటల నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు రాగానే సాయం అందిస్తామని.. ఆవేదన వద్దని సూచించారు. మరో రైతు స్పందిస్తూ.. తమను ప్రాణాలతో కాపాడారని.. ముందుగానే హెచ్చరికలు చేసి.. తుఫాను షెల్టర్లకు తరలించారని.. అయితే తాము చేసుకున్న సాగు పూర్తిగా నష్టపోయామని చెప్పారు. ఆయనను కూడా చంద్రబాబు ఓదార్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఎలాంటి నష్టం వాటిల్లని పంటల సాగును చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో సాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉందన్నారు. అనంతరం.. పునరావాస కేంద్రాలను కూడా చంద్రబాబు పరిశీలించారు. మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తుఫాను రావడానికి ముందే తను షెల్టర్లకు చేర్చారని.. పిల్లా పాపలు అందరూ క్షేమంగా ఉన్నారని మహిళలు తెలిపారు. అయితే.. తమ ఇళ్లు కూలిపోయి.. సామగ్రి పూర్తిగా చిన్నాభిన్నం అయిందని వివరించారు. ప్రభుత్వం ఉదారంగా తమను ఆదుకోవాలని కోరారు.
వారిని కూడా ఓదార్చిన సీఎం.. పునరావాస కేంద్రాలనుంచి వెళ్లే వారికి 1000 రూపాయల చొప్పున సాయం అందిస్తున్నామని.. బియ్యం, ఇతర నిత్యావసరాలను కూడాఇస్తున్నామని చెప్పారు. అదేసమయంలో స్వచ్ఛందసంస్థలు కూడా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాయం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. తోచిన విధంగా ఆదుకోవాలని అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికేచర్యలు తీసుకుందన్నారు. దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మిస్తున్నట్టు వివరించారు. సుమారు 3 గంటలకుపైగానే చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో కలియదిరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates