టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాజాగా సీరియస్ అయ్యారు. ఇంత సీరియస్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావడం లేదా? లేక.. నేనేమన్నా.. జోక్ చేస్తున్నానని అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. దీనికి కారణం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగారు. ఇదే విషయంపై జనసేన నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. తాజాగా గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కూటమి పార్టీలు నిర్ధారించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పవన్ అన్నారు. ఈ సమయంలో `ఇంకా ఎక్కడైనా రెబల్స్ ఉన్నారా?“ అని చంద్రబాబు ఇతర మంత్రులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒకరిద్దరు మంత్రులు పత్రికల్లో వచ్చిన కథనాలతోపాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను కూడా ఆయనకు వివరించారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ నిర్ధారించిన నాయకులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా బరిలో ఎవరూ ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నేతలకు కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఎవరూ ఉండడానికి వీల్లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కూటమి ఐక్యతకు భగ్నం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న వారిపై చర్చలు తీసుకోవాలని.. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులను చంద్రబాబు ఆదేశించారు.
గెలిపించే బాద్యత..
కూటమి పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఇంచార్జ్ మంత్రులే తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు ప్రజలను ఆదుకుంటూనే మరోవైపు పార్టీ నాయకులతోనూ చర్చలు జరపాలని.. అసంతృప్తి, సంతృప్తి అనే విషయాలపై తర్వాత మాట్లాడుతామని.. ప్రస్తుతానికి పోటీలో పార్టీ నిర్ధారించిన వారే ఉండాలని తేల్చి చెప్పారు. ముఖ్యంగా రెబల్స్ విషయంలో పార్టీ ఉపేక్షించదన్న సంకేతాలు పంపించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates