చంద్రబాబుపై కేటీఆర్ సాఫ్ట్ కార్నర్… ఏంటి మార్పు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు పేరు చెబితే చాలు అగ్గిమీద గుగ్గిలమైన కేసీఆర్ కుటుంబానికి పదవి పోయిన తర్వాత వాస్తవం తెలిసిందా అని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఈమధ్య కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెగ పొగిడేస్తున్నారు. ఏమిటో ఈ మార్పు అని తెలంగాణా మీడియా, ప్రజలు చర్చించుకుంటున్నారు.

తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందన్న ఆయన ఏపీలో కూడా ఇలాగే కరువు పరిస్థితులు వున్నాయని, అయితే చంద్రబాబు సమర్థవంతంగా కరువును ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే ఏపీలో కరువు ప్రభావం పెద్దగా కనిపించడం లేదన్నారు. తెలంగాణాలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరువును ఎదుర్కోవడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇస్తేనే పనులవుతున్నాయని ఆరోపించారు.

నీటిని సమర్థవంతంగా వాడుకునే విషయంలో రేవంత్ రెడ్డి చాలా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీరు వుందని, రేవంత్ రెడ్డికి ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించాకైన కరువు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కేటీఆర్ ప్రెస్ మీట్ మొత్తం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంతగా విమర్శించారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అంతగా ఆకాశానికి ఎత్తారు. దీంతో అక్కడ వున్న పాత్రికేయులు బిత్తర పోయారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఆయనతో మంచి సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం తెలిసిందే. బహుశా వచ్చే తెలంగాణా సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే కేటీఆర్ అండ్ కో సరికొత్త రాజకీయ ఆలోచనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.