ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ఎవరినైనా టార్గెట్ చేశారంటే మోత మామూలుగా ఉండదు. అవతలున్నది ఎవరిని చూడకుండా తీవ్ర పదజాలంతో విమర్శిస్తారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల పేరు ఎత్తితే ఆయనెలా మండిపోతారో తెలిసిందే. కొంత కాలంగా వాళ్లిద్దరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పరుష పదజాలం కూడా వాడుతున్నారు.
ఈ విమర్శలకు చంద్రబాబు, లోకేష్ పెద్దగా బదులిచ్చింది లేదు. కానీ ఇటీవల నందమూరి బాలకృష్ణ.. నాని విమర్శలపై స్పందించారు. ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తాము ఊరికే మాటలు మాట్లాడమని, చేతల్లో చూపిస్తామని.. జాగ్రత్తగా మాట్లాడాలని బాలయ్య నానికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నాని స్పందించారు.
చంద్రబాబు, లోకేష్‌లపై మాట్లాడినట్లు బాలయ్య విషయంలో తీవ్ర పదజాలం వాడలేదు కానీ.. నందమూరి వారుసుడికి గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు నాని. బాలకృష్ణ ఆటలో అరటి కాయల లాంటి వాడని.. ఆయన గురించి మాట్లాడ్డానికి ఏముందని నాని అన్నారు. ఎన్టీఆర్ ఎంతో ఎత్తున ఉంటారని, ఆయన గొప్ప వ్యక్తి అని.. అలాంటి వ్యక్తికి వెన్ను పోటు పొడిచి.. పదవి లాక్కుని ఆయన చావుకు కారణమైన చంద్రబాబు వెనుక బాలయ్య తిరుగుతున్నాడని.. ఇక ఆయన గురించి ఏం మాట్లాడాలని నాని ప్రశ్నించారు.
తన తండ్రికి ఇలా ఒక వ్యక్తి అన్యాయం చేస్తే ఊరికే వదిలేవాణ్ని కాదని.. కానీ బాలయ్య మాత్రం తండ్రిని మోసం చేసిన వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నాడని నాని విమర్శించారు. పులి కడుపున పులే పుడుతుందని వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారని.. కానీ ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి కడుపున ఇలాంటి వాళ్లు పుట్టారేంటి అని బాలయ్యను చూసి అనుకుంటున్నారని నాని అన్నారు. బాలయ్య టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతున్నారట కదా అని నాని దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన స్థాయికి ప్రెసిడెంట్ పదవే అడగాలని అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates