ఇఫ్పటికిప్పుడు లేదా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఎన్డీయేనే ప్రభుత్వంలోకి వస్తుందని తాజా సర్వే తేల్చిచెప్పింది. మూడ్ ఆఫ్ ది నేషన్ అనే అంశంతో ఇండియా టు డే-కార్వీ సంస్ధల ఆధ్వర్యంలో జాతీయ స్ధాయిలో సర్వే జరిగింది. దేశసరిహద్దుల్లో చైనా, పాకిస్ధాన్ గొడవలు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం, కరోనా వైరస్, అస్తవ్యస్ధ ఆర్ధిక విధానాల్లాంటి అనేక సమస్యల మధ్య మామూలుగా అయితే జనాలు కేంద్రంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతారు.
కానీ ఇపుడు మాత్రం మెజారిటి జనాలు ఎన్డీయే వైపే మొగ్గుచూపుతున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 43 శాతం ఆదరణతో 321 పార్లమెంటు సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. 2020 ఆగష్టు నెలలో జరిగిన సర్వేలో 316 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. అలాంటిది తాజాగా జరిగిన సర్వేలో మరో ఐదు సీట్లు పెరగటం గమనార్హం. అయితే 2019లో ఎన్డీయే గెలుచుకున్న 357 సీట్లలో తాజా సర్వే ప్రకారం 36 సీట్లు తగ్గిపోతుందని అర్ధమవుతోంది.
ఇదే సర్వేలో హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో 104 సీట్లను, పశ్చిమభారతంలో 85 సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని తేలింది. తెలివైన పొత్తులుంటే తూర్పుభారతంలో 100 స్ధానాలకు ఢోకా లేదని కూడా సర్వేలో తేలింది. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం నరేంద్రమోడికి ఆశాభంగం తప్పదని సర్వేలో స్పష్టమైందట. దక్షిణ భారతం మొత్తం మీద ఎన్డీయేకి మహా అయితే 32 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
దక్షిణాధి రాష్ట్రాలైన కర్నాటకలో మాత్రమే కాస్త బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి గెలిచి మరోసారి ఓడుతోంది. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి వెనకబడిపోతోంది. ఇక కేరళ, తమిళనాడు, ఏపి, తెలంగాణాలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోతోంది. తెలంగాణాలో ప్రస్తుతానికి నలుగురు ఎంపీలున్నా వచ్చే ఎన్నికల్లో వాటిని నిలుపుకుంటారా అన్నదే డౌటు. సర్వే ప్రకారం చూస్తే రేపటి పార్లమెంటు ఎన్నికల్లో ఏవైనా ఎంపి సీట్లు వస్తే కర్నాటకలోనే వచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడు, ఏపి, కేరళలో ఒక్కసీటు కూడా గెలిచే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. మరి తాజా సర్వే ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.