ఇప్పుడు పార్టీ ప్రమోషన్ ఎందుకు సాయిరెడ్డి గారు

ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నాన‌ని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి తాజాగా మ‌రో డేట్ చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ఆయ‌న ద‌స‌రా రోజు త‌న పార్టీని ప్ర‌క‌టిస్తాన‌ని.. విధి విధానాలు, జెండా కూడా ఖ‌రారు చేస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అంతేకాదు.. త‌న పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రో కూడా కుదిరితే వెల్ల‌డిస్తాన‌ని కూడా చెప్పారు. అయితే.. తాజాగా చేసిన ట్వీట్‌లో డేట్ మార్చేశారు. ద‌స‌రా రోజు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన ఆయ‌న ఆ విష‌యాన్ని వ‌దిలేసి న‌వంబ‌రు రెండో వారంలో క‌లుద్దాం. అని ముక్తాయించారు. అంటే.. సాయిరెడ్డి పార్టీ ప్ర‌క‌ట‌న నవంబ‌రులోనే ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇక‌, ఇదేస‌మ‌యంలో ర‌ప్పా ర‌ప్పా.. అంటూ వైసీపీని, రెడ్ బుక్ అంటూ టీడీపీని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ర‌ప్పా ర‌ప్పా.. రెడ్ బుక్ మ‌ధ్య రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని.. అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నిసాయిరెడ్డి దుయ్య‌బ‌ట్టారు. శుక్ర‌వారం, శ‌నివారం జ‌రిగిన ఘ‌ట‌న‌లు చూస్తే.. ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు ఈ పార్టీలు ఉపయోగ‌ప‌డుతున్నాయో అర్ధం అవుతుంది అని సాయిరెడ్డి పెద‌వి విరిచారు. అంతేకాదు.. చంద్ర‌బాబు-జ‌గ‌న్ కుటుంబాల మ‌ధ్య‌, కుల‌-మైనారిటీ కుటుంబాలు పోషిస్తున్న ఫ్యాక్ష‌న్ మ‌ధ్య సివిల్ వార్ న‌డుస్తోంది. అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లుఎంత ఘోరంగా ఉన్నాయో.. శుక్ర‌, శ‌నివారాలు జ‌రిగిన ఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. 2029 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు(టీడీపీ, వైసీపీ)… రౌడీలు, ముఠాలు న‌డిపేవారు, మాన‌భంగాలు చేసేవారు, హ‌త్య‌లు చేసేవారిని నేరుగా బ‌రిలో నిలిపే ప్ర‌మాదం ఉంద‌ని సాయిరెడ్డి హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న యువ‌త‌కు కీల‌క పిలుపునిచ్చారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగాలా..? రాష్ట్రంలో మార్పు అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించారు. త‌మ పార్టీలోకి యువ‌త చేరాల‌ని ఆయ‌న కోరారు. జెన్‌జీ దిశ‌గా తాము అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. రెండు పార్టీల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పే మూడో ప్ర‌త్యామ్నాయ పార్టీని ఆద‌రించాల‌ని పేర్కొన్నారు. జెన్‌జీకి త‌మ పార్టీ ప్రాధాన్యం ఇస్తుంద‌న్నారు.

ఇల్లు కాలుతుంటే..

సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో ప‌రిస్థితిని చూసి.. సీనియ‌ర్ నేత‌గా సూచ‌న‌లు ఇవ్వాల్సింది పోయి.. ఇల్లు కాలుతుంటే.. సిగ‌రెట్ వెలిగించుకునే వాడి మాదిరిగా.. త‌న పార్టీ ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నార‌ని ప‌లువురు నెటిజ‌న్లు వ్యాఖ్యా నించారు. మ‌రికొంద‌రు సాయిరెడ్డిని కూడా పుంగ‌నూరులో పోటీకి పెట్టాల‌ని సూచించారు. సాయిరెడ్డి పార్టీలో నేను చేర‌తా.. అకౌంటింగ్‌ నేర్చుకుంటా అంటూ మ‌రికొంద‌రు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.