పార్లమెంటు నియోజకవర్గాల పెంపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న దరిమిలా.. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పార్లమెంటు నియోజకవర్గాలను పెంచాలన్నవిషయాన్ని తాము సూచించిందేనన్నారు. 2024 ఎన్నికల సమయంలోనే పార్లమెంటు నియోజకవర్గాలపై చర్చ నడిచిందన్నారు. దీనిపై తాము పూర్తిస్థాయిలో కేంద్రానికి కొన్ని సూచనలు చేశామని తెలిపారు. దీని ప్రకారం.. జనాభా ప్రాతిపదికన కాకుండా.. ఏకమొత్తంగా 50 శాతం చొప్పున పార్లమెంటు స్థానాలు పెంచాలని సూచించామన్నారు.
శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పార్లమెంటు నియోజకవర్గాలు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. “మేం మొదటి నుంచి ఒకటే చెబుతున్నాం.. జనాభా ప్రాతిపదికన కాకుండా 50 శాతం మేరకు పార్లమెంటు స్థానాలు పెంచాలని కోరాం. ఇప్పుడు అదే చేస్తున్నారు. గతంలోనే తీసుకువచ్చిన బిల్లులో ఈ విషయాన్ని చేర్చాలని మా ఎంపీలు కోరారు. అయితే.. అప్పట్లో సాధ్యపడక పోవచ్చు. ఇప్పుడు 50 శాతం పెంచుతున్నట్టు తెలిసింది. ఇది మంచిది“ అని వ్యాఖ్యానించారు.
నాకు కూడా ఆహ్వానం..
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న 30వ తారీకు నాడు.. ఎన్డీయే పక్షాల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. డిల్లీకి రావాలంటూ.. తనకు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కూడా ఆహ్వానం అందిందన్నారు. పార్లమెంటు సీట్ల పెంపునకు తాము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలు 38 నుంచి 40 వరకు పెంచే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
రెండు విధాలా లాభం..
పార్లమెంటు సీట్లను పెంచడం ద్వారా .. రెండు విధాల ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. 1) ప్రజలకు మరింత సేవ చేసేందుకు నాయకుల సంఖ్య పెరుగుతుందన్నారు. దీనివల్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పెరిగితే.. మహిళా పార్లమెంటు సభ్యుల పెరుగుతుందన్నారు. అలానే 2) ఎంపీ లాడ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నియోజకవర్గం నిధులు కూడా ఎక్కువగా వస్తాయని.. తద్వారా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. అందుకే తాము జనాభా ప్రాతిపదికన కాకుండా.. పూర్తిగా 50 షశాతం సీట్లు పెంచాలని కోరామని.. ఇప్పుడు అదే జరుగుతోందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates