యోగికి మూడోసారి ఛాన్స్ లేనట్టేనా…?

బుల్డోజర్ యాక్షన్ తో దేశంలో క్రేజ్ తెచ్చుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు మూడోసారి సీఎం ఛాన్స్ ఇస్తారా లేదా అనే చర్చ జోరుగా కొనసాగుతుంది. బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ కు ప్రత్యేకంగా అభిమానులు వున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలతో సమానంగా ఆయనకు ఇమేజ్ వుంది. మోదీ తర్వాత ప్రధాన మంత్రి ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా యోగి పేరే వినిపించడం ఆ పార్టీలోనే కొందరికి నచ్చడం లేదు. అలాంటి వారంతా ఆయన వెనక చేరారు.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఒకరు. ఆయనకు కేంద్రంలో కీలక నాయకుల ఆశీస్సులు వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ‘కమలం’ గుర్తుపైనే పోటీ చేస్తుందని, ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు,  కేంద్ర పరిశీలకులు కలిసి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారని డీసీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఈ ఎన్నికల తర్వాత యోగి మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మరొకరు కూడా కావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జౌన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూమౌర్య చేసిన కామెంట్స్ ఉత్తర ప్రదేశ్ బీజేపీలో వేడి పుట్టించాయి. మౌర్య సంగతి పక్కన పెడితే రాజకీయ విశ్లేషకులు సైతం అదే సంగతి చెబుతుండటం విశేషం. 

ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యానాథ్ తొలిసారిగా 2017 మార్చి 19 వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లు విజయవంతంగా పరిపాలించిన ఆయనకు రెండోసారి కూడా అవకాశం దక్కింది. 2022 మార్చి 25వ తేదీన రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఓబీసీ వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో ముఖ్యమంత్రి రేసులో ముందున్న ఆయన చివరి నిమిషం వరకు పోరాడాడు. అనివార్య పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి పదవితో సరి పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకు ముఖ్యమంత్రి గద్దె మీద ఆశలు పెట్టుకొని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇంకొక ఉప ముఖ్యమంత్రి కూడా వున్నాడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బ్రజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రిగా అటు ప్రభుత్వంలో, ఇటు రాష్ట్ర బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక వర్గమైన ఠాకూర్ అధికారుల ప్రాధాన్యత పెరిగిందని, బ్రాహ్మణ వర్గానికి తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో వున్నారు. అలాంటి వారితో ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటుగా కేంద్రంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సఖ్యత అంతంత మాత్రంగా వున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ, తనకంటూ సొంత బ్రాండ్ ఏర్పరుచుకోవడం ఢిల్లీ పెద్దలకు నచ్చడం లేదని ప్రచారం జరుగుతుంది. దాంతో ఆయనకు చెక్ పెట్టేందుకు 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో టికెట్ల పంపిణీ విషయంలో యోగి సూచించిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించలేదని, ఇది యోగికి మనస్థాపం కలిగించిందని కమలం శ్రేణులు చెబుతున్నారు. అయితే లక్నోలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ…యూపీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యోగి మాత్రం రేపటి ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అందరికీ తెలుసని చెప్పడం విశేషం.