ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మూడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే.. షెడ్యూల్ వచ్చే వరకు కూడా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కమిటీలు వేసి.. చర్చలు జరిపినా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నా.. సుదీర్ఘ సమయం చర్చోపచర్చలు చేపట్టినా.. సీట్ల సర్దుబాటు వ్యవహారం మాత్రం ఇంకా ముడివీడలేదు. అయితే.. ఈ వ్యవహారం.. ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీకి ఆయుధంగా మారుతున్న నేపథ్యంలో కూటమి అలెర్ట్ అయింది. తమ మధ్య విభేదాలు లేవని.. కూటమిగానే ఎన్నికల్లో తలపడతామని స్పష్టం చేసింది.
రాష్ట్రపతి పర్యటన ఉన్నా..
తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు వచ్చారు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జనసేన నాయకులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరికి అవకాశం.. అనే రెండు అంశాలపైనే మంత్రులు నాదెండ్ల మనోహర్ సహా.. జనసేన ముఖ్య నేతలతో చంద్రబాబు స్వయంగా చర్చించారు. అయినప్పటికీ తుది నిర్ణయానికి రాకపోవడం గమనార్హం.
ఇదే విషయాన్ని జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. సయోధ్యగానే ముందుకు సాగుతామని.. అయితే.. సీట్ల విషయంపై మాత్రం ఇంకాక్లారిటీ రాలేదన్నారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలు, ప్రచారం నమ్మవద్దని ఆయన జనసేన, టీడీపీ నాయకులకు కూడా సూచించారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందన్నారు. ఎవరికి ఎక్కడ ఎంత బలం ఉందన్నది అంచనా వేసుకుని ఆమేరకు నిర్ణయం తీసుకునే దిశగా తమ చర్చలు ఫలించాయన్నారు. సీట్ల సంఖ్య మాత్రమే ప్రకటించాల్సి ఉందని తేల్చి చెప్పారు. రెండు రోజుల్లో దీనిపైనా క్లారిటీ వస్తుందని .. కూటమి పార్టీలు కలివిడిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు.
ప్రకటనలోనే తాత్సారం?
ఇక, సహజంగానే ఇన్ని స్థాయిల్లో చర్చల తర్వాత కూడా సీట్లపై ఎందుకు సర్దుబాటు చిక్కడం లేదన్నది కీలక ప్రశ్న. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చర్చల అనంతరం కూడా ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇరు పార్టీల్లోనూ గత ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారు.. పార్టీల కోసం కష్టించి పనిచేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు.
ఇప్పుడు వీరంతా స్థానిక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ రేంజ్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే.. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినా.. ప్రకటన చేయడంలోనే తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడే కాకుండా.. నామినేషన్ ఘట్టం వరకు వేచి చూస్తే.. కొంత మేరకు వివాదాలు సర్దుమణుగుతాయని అంచనావేస్తున్నట్టు ఇరు పార్టీల నాయకులు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates