వందలు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీలకు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి రావాలని.. విచారణకు సహకరించాలని అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు కడప ఎంపీ బుధవారం వారి ముందుకు వెళ్లారు. అయితే..ఆయన నాలుగు ట్రంకు పెట్టెల్లో వేల పేజీల్లో బ్యాంకు ఖాతాల వివరాలను అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు.ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో ఆయన హత్యకు 40 కోట్ల రూపాయల మేరకు సుపారీ ఇచ్చారని సీబీఐ, ఈడీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఏయే మార్గాల ద్వారా ఆ సొమ్ములు చేతులు మారాయి? అనే వివరాలపై కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏ1, ఏ2, ఏ3లుగా ఉన్న నిందితులను ఈడీ అధికారులు విచారించారు.
వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారు. బ్యాంకు లావాదేవీలను తీసుకురావలని.. అవి కూడా 2019 నుంచి జరిగిన బ్యాంకు లావాదేవీలే అయి ఉండాలని షరతు విధించారు. దీంతో 3 బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలతో కూడిన పత్రాలను తీసుకుని అవినాష్ రెడ్డి అధికారుల ముందు హాజరయ్యారు. సదరు సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
కాగా, 2019 నుంచి బ్యాంకు స్టేట్మెంట్లు ఈడీ అధికారులకు అందజేసిన నేపథ్యంలో వీటిని పరిశీలించేందుకే అధికారులు రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని అంటున్నారు. మొత్తం రూ.40 కోట్ల సుపారీతో పాటు సంఘటనా స్థలంలో ఆధారాల చెరిపివేతపైనా ఈడీ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే.. తాను ఈ విషయంలో ఇప్పటికే విచారణకు సహకరించానని, ప్రస్తుతం స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాను ప్రజల మధ్య ఉండాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates