కోర్టుకు రోజూ రమ్మంటే జగన్ వస్తారా? ఈ సందేహం రాజకీయ నాయకులది కాదు.. సీబీఐ కోర్టు న్యాయమూర్తిది!. ఆశ్చర్యంగా అనిపించినా.. బుధవారం జరిగిన విచారణలో న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై విచారించిన న్యాయమూర్తి.. కోర్టుకు రోజూ రమ్మంటే జగన్ వస్తారా?. ఆయన మాజీ ముఖ్యమంత్రి అని మీరు చెబుతున్నారు కదా? కేసులో ఆయన పాత్రను పూర్తిగా నిర్ధారించినట్టు లేదు. దీనిపై ఆయన వివరణను తెలుసుకుని తుది నిర్ణయం వెలువరిస్తాం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఇంతకీ విషయం ఏంటి?
వైసీపీ అధినేత జగన్పై 2012-13 మధ్య కాలంలో జగన్పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. ఇవి గత పది సంవత్సరాలుగా విచారణ పరిధిలోనే ఉన్నాయి. వీటికి ఒక తార్కిక ముగింపు ఇవ్వాలని ఇటీవల హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. జగన్పై నమోదైన కేసులను రోజువారీగా విచారించాలని.. కోర్టుకు ఆయనను కూడా పిలవాలని తమ పిటిషన్లో అభ్యర్థించారు. ఏళ్ల తరబడి కేసులు పేరుకుపోతే.. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు మరింత పుంజుకుంటారని కూడా పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా ఈ పిటిషన్ విచారణకు రాగా.. జగన్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జగన్ పూర్వ ముఖ్యమంత్రి అని, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడి హోదాలోఉన్నారని.. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్ను కోర్టుకు పిలిచి విచారించడం.. ఆయన హోదాకు భంగం కలిగించినట్టే అవుతుందని పేర్కొన్నారు. ఇక, ఈ కేసుల్లో జగన్పై నేర నిరూపణ కాలేదని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే.. రోజు వారీ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీగా విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ న్యాయస్థానం ఆమేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే.. జగన్ వ్యక్తిగత హాజరుపై మాత్రం తదుపరివిచారణలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా తుది ఆదేశాలు ఇవ్వనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates