లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేరకు రిజర్వేషన్ కల్పించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. దీనిపై సభలో చర్చించి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జీవోలు కూడా విడుదల చేశారు. అయితే.. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడం.. రిజర్వేషన్లను 50 శాతానికి మించరాదని కోర్టు చెప్పడం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంపై సుప్రీంకో ర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం విచారణ దశలో ఈ వ్యవహారం ఉంది. అయితే.. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని అధికార పార్టీ నిర్ణయించింది.
వైసీపీ కారణంగానే బీసీలకు అన్యాయం జరుగుతోందని.. వారికి రిజర్వేషన్ కల్పించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీసీలకు వైసీపీ వెన్నుపోటు పొడుస్తొందని సీఎం చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఉద్యమించాలని నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణను కూడా ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా.. వ్యతిరేకంగా వచ్చినా.. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే.. వైసీపీ కారణంగానే బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వాదనను వినిపించాలని, ప్రజల్లో బీసీల రిజర్వేషన్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కాగా.. ఇంతలోనే వైసీపీ అలెర్ట్ అయింది. టీడీపీ కంటే కూడా ముందుగానే తాము ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 16న విశాఖలో బీసీ గర్జన పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభ ద్వారా.. వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలును వివరించనున్నారు.
అదేసమయంలో బీసీలకు సంబంధించి చేసిన రిజర్వేషన్ జీవోలపైనా వైసీపీ తన వాయిస్ వినిపించనుంది. అయితే.. ఈ సభలో కూడా యధావిధంగా జగన్ హాజరుకావడం లేదని వైసీపీ ప్రకటించింది.కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు మాత్రమే ఈ సభకు హాజరుకానున్నారు. మొత్తంగా టీడీపీ కంటే ముందే.. వైసీపీ అలెర్టు కావడం.. బీసీల విషయంలో తమ వాయిస్ వినిపించేందుకు ప్లాన్ చేసుకోవడం వంటివి ఆసక్తిగా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates