గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది పెద్ద కంపెనీలకు గ్రీన్‌కార్డుల జారీకి సంబంధించిన ఓ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ నిర్ణయం వల్ల తమ కంపెనీకి పెద్దగా ఇబ్బంది ఉండదని టీసీఎస్ ప్రకటించింది. అమెరికాలో ఉద్యోగుల నియామకాలు కూడా యథావిధిగా కొనసాగిస్తామని తెలిపింది.

అమెరికాలో విదేశీ ఉద్యోగులు శాశ్వతంగా స్థిరపడేందుకు గ్రీన్‌కార్డ్ అవసరం. ఇందుకోసం కంపెనీలు ముందుగా పర్మ్ అనే ప్రక్రియను పూర్తి చేయాలి. అంటే ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ ఇప్పించాలంటే కంపెనీలు ముందుగా కార్మిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి ప్రక్రియనే పర్మ్ అంటారు. ప్రస్తుతం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీలకు సంబంధించిన ఈ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

కొత్త దరఖాస్తులను స్వీకరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్నవాటి పరిశీలనను కూడా నిలిపివేసింది. ఈ నిర్ణయంపై టీసీఎస్ స్పందించింది. గత రెండేళ్లలో తమ కంపెనీ నుంచి వచ్చిన పర్మ్ దరఖాస్తులు పది కంటే తక్కువేనని వెల్లడించింది. అందుకే అమెరికా నిర్ణయం తమ ఉద్యోగుల నియామకాలపై, క్లయింట్లతో చేస్తున్న వ్యాపారంపై ప్రభావం చూపదని తెలిపింది. అమెరికాలో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో మరో 15 వేల మందిని అక్కడ నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్ కూడా అమెరికా ప్రభుత్వ ఆరోపణలపై స్పందించింది. తమ అమెరికా ఉద్యోగుల్లో ఎక్కువ మంది స్థానికులేనని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన హెచ్‌-1బీ దరఖాస్తుల్లో 80 శాతం ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల వీసా పొడిగింపు, మార్పులకు సంబంధించినవేనని వివరించింది. అవసరమైన వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. భారత ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్ కూడా ఈ నిర్ణయంపై స్పందించింది. భారత కంపెనీలు కొన్నేళ్లుగా హెచ్‌ 1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించాయని తెలిపింది. అమెరికాలోనే స్థానికులను నియమించుకుంటున్నాయని పేర్కొంది.