వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి మతతత్వవాదిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. గతంలో ఏనాడూ మతం గురించి మాట్లాడని సాయిరెడ్డి… కొద్ది నెలలుగా అదే టాపిక్ పై ఫోకస్ చేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు.
ఏపీలో ప్రజా సమస్యలు లేవన్నట్లు… ఈ మతపరమైన విషయాలు మాత్రమే ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న సాయిరెడ్డి… తాజాగా మరోసారి జగన్, చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే సాయిరెడ్డి త్వరలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు అయినా ఆశ్చర్యం లేదని..ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా…అది బీజేపీ బీ పార్టీనే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై ఆ పార్టీ మాజీ నేత సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు రెడ్ల ఓట్లు కావాలంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దని, క్రిస్టియానిటీ నుంచి హిందూ మతానికి రాావాలని..అప్పుడు జగన్ పేరుకు సార్థకత వస్తుందని అన్నారు. అలా కాకుండా, రెడ్ల పేరు పెట్టుకొని..క్రైస్తవులకు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ…ముస్లింలకు సెక్యులర్ అని చెప్పుకుంటూ మోసం చేయొద్దని హితవు పలికారు. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోవద్దని అన్నారు. ఇక, జగన్ హిందూ మతంలో చేరతానంటే అక్కున చేర్చుకొని ఆహ్వానిస్తామని కూడా సెలవిచ్చారు.
చంద్రబాబు కులాన్ని, జగన్ మతాన్ని వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హిందువుగా ఉండి హిందువులకు ద్రోహం చేస్తున్నారని, కుల,మత రాజకీయాలు వద్దని సాయిరెడ్డి హితవు పలికారు. కానీ, ఈ ప్రెస్ మీట్ మొత్తం ఆయన మాట్లాడింది కులం, మతం గురించే. తాను హిందువునని, ఏ చర్చికి, మసీదుకు వెళ్లినా ప్రార్థిస్తానని..కానీ, క్రిస్టియన్లు, ముస్లింలు…హిందూ ఆలయాలకు రారని…ఒకవేళ వచ్చినా…రెండువేళ్ల మధ్య నుంచి తీర్థాన్ని వదిలేస్తారని సంచలన ఆరోపణలు చేశారు.
అదే మాదిరిగా వారు గుడికి వస్తే…దేవుడి కండువా వేసుకొనే పరిస్తితి లేదని…వారు ప్రసాదం తినరని…ఇది వారు పాటించే సెక్యులరిజం అని విమర్శించారు. అదే హిందువు చర్చికి వెళ్లినా..మసీదుకు వెళ్లినా…ఆయా మతాల వారి సంప్రదాయాలను పాటిస్తారని చెప్పారు. అది మన పెద్దలు మనకు నూరిపోసిన పరమత సహనం అని, అది మన బ్లడ్ లో ఉందని, ఇతర మతాలవారు ఇది పాటించడం లేదని ఆరోపించారు.
ఇక, గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, అయితే, ఆ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని అన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates