డబుల్ థమాకా అంటే ఇదేనేమో. టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికించి.. తీవ్రమైన మానసిక హింసకు గురి చేయటమే కాదు.. అంతులేని మనోవ్యధకు కారణమైన కేసుల సాలెగూటి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఇంకా బయటకు రాలేదు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఆమె.. తన పోస్టింగ్ ను తెలంగాణ నుంచి ఏపీకి మార్చుకోవటంలో ఇటీవల సక్సెస్ కావటం తెలిసిందే.
సాంకేతికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ.. తాను ఏపీ క్యాడర్ అని.. తనను ఏపీకి బదిలీ చేయాలని కోరిన ఆయన వినతిని క్యాట్ ఓకే చెప్పటంతో ఆమెను ఏపీకి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీకి వచ్చిన ఆమెను జగన్మోహన్ రెడ్డి సర్కారు పురపాలక శాఖ కార్యదర్శి హోదాను ఇచ్చారు. తాజాగా.. ఈ హోదాను మరింత పెంచటమే కాదు.. ముఖ్య కార్యదర్శి హోదాతో ప్రమోషన్ ఇచ్చారు.
అయితే.. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు.. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు.. డీవోపీటీ నిర్ణయం మేరకే ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. కేసుల తిప్పలుతో కొన్నేళ్లుగా వేదనను అనుభవిస్తున్న శ్రీలక్ష్మికి ఏపీకి బదిలీ చేయటం.. అక్కడ వరుసగా కీలక పదవులు లభించటం చూస్తే.. ఆమె పడిన బాధలకు సాంత్వన లభిస్తుందని చెప్పక తప్పదు.