వైసీపీ స‌ర్కారుకు షాక్‌: ఇన్‌సైడర్ ట్రేడింగ్ తూచ్.. కేసు కొట్టేసిన హైకోర్ట్‌

రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున ప్ర‌చారం చేసిన రాజ‌ధాని భూముల ఇన్‌సైడెర్ ట్రేడింగ్ తూచ్ యేనా? ఈ ఆరోప‌ణ‌లు కేవ‌లం రాజ‌కీయ‌మేనా? ముఖ్య‌మంత్రి నుంచి మంత్రుల వ‌ర‌కు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వ‌రకు చేసిన ఆరోప‌ణ‌లన్నీ డొల్లేనా? అన్నీ నిరాధారాలేనా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నా యి. ప్ర‌పంచంలో అతి పెద్ద‌న‌గ‌రంగా. అత్యంత ప్ర‌భావిత‌మైన రాజ‌ధానిగా ఉంటుంద‌ని భావించి గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దూర‌దృష్టితో నిర్ణ‌యించి.. శంకుస్థాప‌న చేసిన ఆంధ్రుల దేవ‌భూమి.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అనేక వాద‌న‌లు తెర‌మీదికి తెచ్చింది.

దీనిలో ప్ర‌ధాన‌మైంది.. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని. అమ‌రావ‌తి ఎక్క‌డ ఏర్ప‌డుతుందో ముందుగానే త‌న వారికి లీక్ చేయ‌డం వ‌ల్ల చంద్ర‌బాబు మ‌నుషులు.. రాజ‌ధాని ప్రాంత‌లో రైతుల‌ను మ‌భ్య‌ప‌రిచి.. భూముల‌ను అతిత‌క్కువ‌కు కొనేసి.. త‌ర్వాత రాజ‌ధాని భూముల స‌మీక‌ర‌ణ‌లో భారీ మొత్తాల‌కు ప్ర‌భుత్వానికి విక్ర‌యించార‌ని.. కొంద‌రు త‌మ ద‌గ్గ‌రే ఉంచార‌ని.. అందుకే రాజ‌ధాని భూముల్లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం వాదించిన.. వాదిస్తున్న విష‌యం తెలిసిందే. అసెంబ్లీలోనూ దీనిపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ కూడా జ‌రిగింది. క‌మిటీల‌ను కూడా వేశారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ భూములు కొన్నార‌నే మిష‌తో.. కొంద‌రిపై హైకోర్టులోనూ కేసులు దాఖ‌ల‌య్యాయి.

ఇలాంటి కేసుల్లో ఒక దానిని తాజా హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని పేర్కొంటూ.. హైకోర్ట‌లో కేసు దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. ఇరు ప‌క్షాల వాద‌నలు విన్న‌ది. ఈ క్ర‌మంలో భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని ఆయ‌న తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని ధర్మాసనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. ప్ర‌భుత్వానికి ఈ ప‌రిణామం భారీ దెబ్బేన‌ని అంటున్నారు నిపుణులు.