పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీసుకున్న ఓ నిర్ణయం సంలచనంగా మారింది. తొందరలోనే జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని మమత నిర్ణయించారు. ఇపుడు సీఎం జాదవ్ పూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందిగ్రామ్ నుండి తాను పోటీ చేయబోతున్నట్లు మమత చేసిన ప్రకటన రాజకీయాల్లో ఓ రకంగా సంచలనంగా మారిందనే చెప్పాలి.
మమత నిర్ణయం సంచలనం ఎందుకంటే ఉద్యమాలకు నందిగ్రామ్ పుట్టిల్లులాంటిది. వామపక్ష ప్రభుత్వం ఉన్నపుడు సెజ్ లకు భూ కేటాయింపులకు వ్యతిరేకంగా మమత చేసిన ఉద్యమం నందిగ్రామ్ నుండే. దానిదెబ్బకు వామపక్ష ప్రభుత్వం కూలిపోయి మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత మమతకు బాగా సన్నిహితుడు, ఎంపి సుబేందు అధికారిది నందిగ్రామే. నందిగ్రామ్ కేంద్రంగా సుమారు 50 నియోజకవర్గాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యముంది.
టీఎంసి రెండోసారి అధికారంలోకి రావటానికి సుబేందు చాలా కీలకపాత్ర పోషించారు. అలాంటి కీలక నేత హఠాత్తుగా టీఎంసీని వదిలేసి ఈమధ్యే బీజేపీలో చేరారు. సుబేందు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ చాలా తేలిగ్గా పై అసెంబ్లీ సీట్లలో గెలుస్తుంటుంది. ఇదంతా బాగా తెలుసిన మమత చాలా వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. నందిగ్రామ్ నుండే మమత ఎందుకు పోటీ చేయబోతున్నారంటే సుబేందు ఆధిపత్యాన్ని తగ్గించేందుకేనట.
మమత గనుక నందిగ్రామ్ నుండి పోటీలో ఉంటే మమతను ఓడగొట్టడం కోసమే సుబేందుకు తన దృష్టి మొత్తాన్ని ఇక్కడే కేంద్రీకృతం చేయాల్సుంటుంది. లేకపోతే తనకు పట్టున్న నియోజకవర్గాల్లో బీజేపీని సుబేందు చాలా తేలిగ్గా గెలిపించుకోగలరు. మమత నందిగ్రామ్ లో పోటీ చేయబోతున్న కారణంగా మమతను వదిలేసి సుబేందు ఇతర నియోజకవర్గాలపై అంతగా దృష్టి పెట్టే అవకాశం ఉండదు. మొత్తానికి మమత వ్యూహాత్మకంగానే నందిగ్రామ్ ను ఎంచుకున్నారు. మరెంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates