శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ దాడి చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ ఘటనపై మండిపడుతున్నారు. టీచర్ల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాడి చేసిన ఏ ఒక్కరిని ఒదిలి పెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చింది. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించింది. టీచర్ల మీద దాడి చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తానంటూ హెచ్చరించారు.
కుప్పం పర్యటనలో వున్న సీఎం చంద్రబాబు ఈ ఘటనను ఖండించారు. రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ధ్వంసం చేశారని, నాడు పాలకులే రౌడీయిజం చేశారని, దారుణాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలో…మానసిక రోగులు అనాలో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన కూడా వారికి బుద్ది రాలేదని, చంపడానికైనా చావడానికైనా సిద్ధమంటూ రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నీ నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అయినా సరే ఫేక్ పార్టీ ఫేక్ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఫేక్ పేపర్ రిపోర్టర్ స్పోర్ట్స్ కోటా టీచర్ మీద దాడి చేశాడని ఇలాంటి ఘటనకు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చని, అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో నిరూపిస్తామని తెలిపారు.
చంద్రబాబు పాలనలో జరిగిన ఏ డీఎస్సీలోనూ పేపర్ లీక్లు, అక్రమాలు జరగలేదని, జరగడానికి అవకాశం ఇవ్వనని చెప్పారు. సీబీఎన్ పాలనలో వేలాది మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం, ఇక ముందు కూడా ఇస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. త్వరలో మరికొన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇది టీడీపీ ట్రాక్ రికార్డ్ అని చెప్పారు. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వైసీపీ పాలకులకు డీఎస్సీ మీద మాట్లాడే అర్హత లేదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates