లక్కీగా రేవంత్ సీఎం అయ్యారు: రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆయన సంచలన విమర్శలు చేశారు. అయితే, కొద్ది నెలల క్రితం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన కాస్త అలక వీడినట్లు కనిపించింది. ప్రీమియం తత్కాల్ కోటాలో సురేఖ మినిస్టర్ బెర్త్ తనకు కన్ఫర్మ్ అవుతుందని ఆయన ఆశించారు.

అందుకు తగ్గట్లుగానే కొద్ది నెలల క్రితం కోమటిరెడ్డి సొంత గడ్డపై జరిగిన బహిరంగ సభలో నా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సభా వేదికపై రేవంత్ రెడ్డి పక్కన రాజగోపాల్ రెడ్డి కూర్చోవడంతో ఇద్దరి మధ్య ప్యాచప్ అయిందని అంతా భావించారు. కానీ, తాజాగా మరోసారి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిక కామెంట్లు చూస్తుంటే వారిద్దరి మధ్య గ్యాప్ అలానే ఉందని అనిపిస్తోంది.

‘‘రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా… యుద్ధం స్టార్ట్ అవుతది… నీకు అదృష్టం కలిసి వచ్చింది.. ముఖ్యమంత్రి అయినవ్… ఇంకా రెండేళ్లు మంచిగుండు…తెలంగాణ ప్రజలను మంచిగ చూసుకో…కొడంగల్ తో పాటు వెనుకబడ్డ నియోజకవర్గాలు మునుగోడుతోపాటు ములుగు, ఆదిలాబాద్ నియోజకవర్గాలు..వాటిని కూడా చూసుకో నాయనా నువ్వు…’’ అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు ఆ ఇద్దరి మధ్య ఇంకా రాజీ కుదరలేదని స్పష్టం చేస్తున్నాయి.

మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరంటూ రేవంత్ పాలనపై రాజగోపాల్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హెచ్చరించారు. ప్రజల సొమ్ము తినే మనిషిని కాదు రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘కాంట్రాక్ట్ టెండర్ ఎంతో చెప్పు..500 కోట్లా? దాని కంటే 20 శాతం తక్కువే టెండర్ వేస్తా.. ప్రజల సొమ్ము కాపాడుతా..నేను కమిషన్లు ఇయ్యను..తీసుకోను…’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.