వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరో ఛార్జిషీట్ దాఖలైంది. జగన్ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న ఈడీ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవడంతో దాల్మీయ సిమెంట్స్ కేసులో మలుపు తిరిగింది. ఈడీ వేగం పెంచడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది. మరో ఏడాదిలో పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఈడీ విచారణ వేగం పెంచడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ మొదలైంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ కు ఇచ్చిన 417 హెక్టార్ల సున్నపురాయి గనుల్ని లీజు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. దాల్మియా సిమెంట్స్ అక్రమంగా ఈ లీజుల్ని పొందినట్లు 2013లో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో సీబీఐ ఆరోపించింది.
ఈ లీజు వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి కుమారుడైన జగన్ తో దాల్మీయ సిమెంట్ కుమ్మక్కయ్యిందని, ఇందులో జగన్ కు వివిధ మార్గాల ద్వారా మొత్తం 150 కోట్ల రూపాయలు ముట్టచెప్పిందని పేర్కొంది. రఘురామ్ సిమెంట్స్ ద్వారా 95 కోట్ల షేర్లు, హవాలా ద్వారా మరో 55 కోట్లు ఇచ్చినట్లు ఆరోపించింది. దీన్ని బేస్ చేసుకొని ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
అయితే ఇదంతా తప్పుడు ఊహాగానాలతో కేసు నమోదు చేశారని జగన్ తరపు లాయర్లు కోర్టులో వాదించారు. సాంకేతిక కారణాలతో కోర్టు ఈ ఛార్జిషీటును కొట్టి వేసింది. ఏ కారణాలు చూపి కోర్టు కేసును కొట్టి వేసిందో వాటిని సవరించి తాజాగా ఇవాళ మరోసారి ఇదే కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
అంతేకాకుండా ఈ ఛార్జిషీట్ లో గతంలో సమర్పించిన ఆధారాలకు తోడు మరిన్ని కొత్త ఆధారాలను కూడా ఈడీ జత చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అంటే మరింత కట్టుదిట్టంగా ఛార్జిషీటు వేసింది. ఇది జగన్ అండ్ కో కు తలనొప్పి తెచ్చి పెట్టే సూచనలు కానవస్తున్నాయని న్యాయవర్గాల్లో వినిపిస్తుంది.
ఇప్పటికే జగన్ మీద 9 ఛార్జిషీట్లు వున్నాయి. ఈ చార్జీషీటుతో పదయ్యాయి. మొత్తం పది చార్జిషీట్లలో జగన్ విచారణను ఎదుర్కొవలసి ఉంటుంది. రెగ్యులర్ విచారణ కనుక మొదలైతే జగన్ పొలిటికల్ స్పీడ్ కు బ్రేక్ పడటం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు కోర్టు తీర్పు కనుక వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది వైసీపీకి అంతుచిక్కడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates