‘తల్లిని చెల్లిని అగౌరవపరచడం జగన్ కే చెల్లు’

వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం నెగటివ్ గా వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా జీవితంలో వున్న జగన్ ఆస్తి కోసం తోబుట్టువును ఇబ్బందులకు గురిచేయడం ప్రజలు గమనిస్తూనే వున్నారు. తన కూతురి వివాహానికి రమ్మని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన షర్మిల గురించి సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై అన్నీ వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫైర్ అయ్యారు. 

“చంద్రబాబుతో  చెట్టపట్టాల్ ” అనే పతాక శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం లేకుండా తల్లి, చెల్లిని అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. తోబుట్టువు గౌరవాన్ని కాపాడాల్సిన కనీస బాధ్యతను వదిలిపెట్టి సొంత పత్రికలో తప్పుడు అర్ధం ధ్వనించే విధంగా తప్పుడు రాతలు రాయించడం జగన్ అసలు నైజాన్ని బయట పెట్టిందని చెప్పారు. సొంత చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచేవారు రాజకీయాలకు అనర్హులని, ఇలాంటివారిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. 

టీడీపీ శ్రేణులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు స్థానిక ఎన్నికలు, కూటమి ధర్మం గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా షర్మిల కూతురి వివాహం ప్రస్తావన వచ్చింది. తెలుగు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత వుంది. బంధుమిత్రులతోపాటుగా పెద్దలు, ప్రముఖులను పెళ్ళికి ఆహ్వానించడం సర్వసాధారణం. అలాంటిది పెళ్లి పిలుపును కూడా రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సంగతి పార్టీ శ్రేణులకు చెప్పారు. జగన్ సైకోయిజం గురించి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలని సూచించారు.