టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో రూపంలో తనకు దక్కిన బ్లాక్ బస్టర్ డెబ్యూ బలమైన పునాది వేసింది. నితిన్ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు భీష్మ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ శిష్యుడిగా వెంకీ కుడుముల మీద చాలా ప్రశంసలు వచ్చాయి. అయితే ఒక్క రాబిన్ హుడ్ మొత్తం తలకిందులు చేసింది. దాని డిజాస్టర్ ప్రభావం వల్ల ఇంత ప్రతిభ కలిగిన డైరెక్టర్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే ఇటీవలే రిలీజైన ఇట్లు అర్జునకు వెంకీ కుడుములు కీలక నిర్మాత. అంతా తానై చూసుకున్నాడు. తాజాగా జరిగిన థాంక్స్ మీట్ లో చిరంజీవి అంతటి మెగాస్టార్ తిట్టు పొగడ్త రెండూ మిక్స్ చేసి తన మీద పంచులు వేశారు. దానికి కారణం ఏమిటంటే భీష్మ తర్వాత డివివి దానయ్య నిర్మాతగా వెంకీ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా ఒక ప్రాజెక్టు అనుకుని అనౌన్స్ చేశారు. కానీ స్క్రిప్ట్ కుదరక అది ముందడుగు వేయకుండానే ఆగిపోయింది. అలా తనకు నిరాశ మిగిలింది.
ఆ ప్రస్తావన చిరు తెచ్చారు. అప్పుడు జరిగింది మొత్తం చెప్పకుండా ఎవరికీ తానుగా సినిమా చేయమని అడిగనని, కానీ ఈ దుర్మార్గుడిని అడిగానని వెంకీ కుడుములని చూపిస్తూ నిలదీశారు. ఈసారి గేట్ తీయనని మూసేస్తున్నానని ఖరాఖండిగా చెప్పేశారు. దానికి వెంకీ బదులు చెబుతూ గోడ దూకి వస్తానని చెప్పడం బాగా పేలింది. ఇదంతా సరదాగా జరిగిన సంభాషణే అయినా వెంకీ కుడుముల ఎంత బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అయితే చిరు కోసం ఆయన స్టోరీ సిద్ధం చేసిన మాట వాస్తవమే. ఒక ఫ్యాక్షనిస్టు జైలు జీవితం పూర్తి చేసుకుని వచ్చాక కొత్త ప్రపంచంలో ఎలా ఇముడుతాడు అనే పాయింట్ మీద వెంకీ కుడుముల ఒక సబ్జెక్టు అనుకున్నారు. కానీ సెకండాఫ్ విషయంలో ఎక్కడో తేడా కొడుతోందని భావించి దాన్ని పెండింగ్ లో పెట్టి వదిలేశారు. తర్వాత రాబిన్ హుడ్ చేయాల్సి వచ్చింది. సరే గతం గతః అనుకుని వెంకీ మళ్ళీ ఫ్రెష్ గా ట్రయిల్ వేస్తే బెటర్. అనిల్ రావిపూడి తరహా వింటేజ్ బాస్ ని బయటికి తెచ్చే సత్తా తనకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates