సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా ఉండి తీరాలి. త్వ‌ర‌లోనే కొత్త పార్టీ అంటూ ఊరిస్తున్న రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డికి ఈ రెండు ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఒక‌ప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గం భారీ మ‌ద్ద‌తు ప‌లికింది. దీంతో ఆయ‌న 2019లో అధికారంలోకి వ‌చ్చేందుకు మార్గం సుగ‌మం అయింది.

2024కు వ‌చ్చే స‌రికి రెడ్డి సామాజిక వ‌ర్గం పూర్తిగా జ‌గ‌న్‌ను విభేదించింది. అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌మను ప‌ట్టించుకోలేద‌న్న‌ది వారి ఆవేద‌న‌, ఆరోప‌ణ కూడా. దీంతో రెడ్లు బ‌లంగా ఉన్న సీమ‌లో కూడా.. వైసీపీ కి అత్తెస‌రు ఓట్లే ప‌డ్డాయి. గ‌త ప్రాభ‌వాన్ని కూడా పార్టీ కోల్పోయింది. ఇక‌, రెడ్డి ఓటు బ్యాంకును ఆలంబ‌నగా చేసుకుని కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల కొన్నాళ్లు ప్ర‌య‌త్నం చేసినా.. ఆమెకు కూడా రెడ్లు చేరువ కాలేక పోయారు. ఇది.. ఇప్ప‌టికీ గ్యాప్‌గానే ఉంది.

ఏపీలోని రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఉన్న ఈ గ్యాప్‌ను అందిపుచ్చుకోవాల‌న్న‌ది సాయిరెడ్డి వ్యూహం. త‌ప్పు కాదు. కానీ, ఆమేర‌కు సాయిరెడ్డిని విశ్వ‌సించే రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్క‌డా? అనేదే ప్ర‌శ్న‌. ఎందుకంటే.. సాయిరెడ్డి ఎంపీగా ఉన్న‌ప్పుడు కానీ.. పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు కానీ.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రత్యేకంగా ఆయ‌న చేసింది ఏమీ లేదు. పైగా.. తాను ఎంపీగా ఉన్న‌ప్పుడు.. ఢిల్లీ రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యారు. రెడ్డి వ‌ర్గం కోరుకున్న‌ట్టుగా.. ఆయ‌న చేసింది కూడా ఏమీలేదు. సో.. రెడ్లు ఇప్పుడు గంప‌గుత్త‌గా సాయిరెడ్డి వెనుక న‌డుస్తార‌ని ఆయ‌న భావిస్తే.. అతి అత్యాసే అవుతుంది.

ఇక‌, ప్ర‌జాబ‌లం విష‌యానికి వ‌స్తే.. 2024లో తొలిసారి నెల్లూరు పార్ల‌మెంటు స్థానం నుంచి సాయిరెడ్డి పోటీ చేశారు. కానీ, ఏమైంది. క‌నీసం చెప్పుకొనేందుకు అవ‌కాశం ఉండే రీతిలో కూడా.. ఆయ‌న‌కు ఓట్లు ప‌డ‌లేదు. ప్ర‌చారం చేసినా.. ఇల్లిల్లూ తిరిగినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీనికి ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలో పోటీ చేసింది లేదు. సో.. ఏతా వాతా.. అటు సొంత సామాజిక వ‌ర్గం నుంచి కానీ.. ఇటు ప్ర‌జ‌ల నుంచి కానీ.. ముందుగా ఆయ‌న మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయాలి. లేక‌పోతే.. ఆయ‌న పార్టీ పెట్టినా.. అది పేప‌ర్ల‌కు, బ్యానర్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.