రాజకీయాల్లోకి మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్నట్లు అనుమానంగా ఉంది. ఫిబ్రవరి 4వ తేదీ నుండి వారంరోజుల పాటు కపిలతీర్ధం టు రామతీర్ధం యాత్ర వివరాలను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను హైందవమతానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడులుగా గమనించాలని కమలంపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు.
విశాఖపట్నంకు సమీపాన ఉన్న రుషికొండలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్ధం నుండి విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు వారం రోజులపాటు యాత్ర నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు వీర్రాజు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. దాడులకు గురైన ఆలయాలను సందర్శిస్తు పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం తదితరా ప్రాంతాల్లో యాత్ర చేస్తామన్నారు.
మొత్తానికి ప్రశాంతంగా ఉండే ఏపిలో కూడా మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది. ఉత్తరాధి రాష్ట్రాల్లో కూడా రామజన్మభూమి అని అంతకుముందు శిలాన్యాస్ అని, బాబ్రీమశీదు కూల్చివేతని ఇలా..మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టిన తర్వాత బీజేపీ ప్రస్తుత స్టేజికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా దక్షిణాదిలోని అన్నీ రాష్ట్రాల్లో ఇప్పటివరకు కమలం పెద్దగా నిలదొక్కుకోలేకపోతోంది. ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలోకి వస్తోంది, పోతోంది.
ప్రస్తుతం తెలంగాణాలో బీజేపీకి నాలుగు ఎంపి సీట్లున్నాయి. ఏపిలో అయితే ఒక్కసీటు కూడా లేదు. అలాగే తమిళనాడు, కేరళలో కూడా సున్నాయే. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణా పైనే కమలంపార్టీ ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణా అధ్యక్షుడు బండిసంజయ్ కూడా ప్రతిరోజు మతపరమైన ఏదో ఓ ప్రకటనతో జనాలను రెచ్చగొడుతునే ఉన్నారు.
ఇటువంటి ప్రకటనల వల్ల కావచ్చు లేదా అధికార టీఆర్ఎస్ తప్పుల వల్ల కావచ్చు గ్రేటర్ లో ఏకంగా నాలుగు డివిజన్ల నుండి 46 డివిజన్లకు పెరిగింది. ఇక అప్పటి నుండి బీజేపిని పట్టడం ఎవరివల్లా కావటం లేదు. తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది కాబట్టి ఏపిలో కూడా ఇటువంటి రాజకీయాలు చేస్తేకానీ జనాలు ఆదరించరని అనుకున్నట్లున్నారు. అందుకనే దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్వాంటేజ్ తీసుకుని పెద్ద యాత్రనే ప్లాన్ చేస్తున్నారు. మరి జనాలు కమలంపార్టీని ఆదరిస్తారా ? చూద్దాం ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates