ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి చెందిన వారి భూముల చిట్టాను వివరించారు. వీటిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత కుటుంబానికి కూడా 37 ఎకరాల మేరకు భూములు ఉన్నాయని వివరించారు. అలానే.. బీఆర్‌ఎస్ నాయకులు గంగుల కమలాకర్, కొండల్‌రావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి, మైహోం రామేశ్వరరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటివారికి కూడా భారీగా భూములు ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత వెంటనే రియాక్ట్ అయ్యారు. తనకు అక్రమంగా భూములు ఏమీ లేవన్నారు. తాను ఎన్నికల అఫిడవిట్‌లో ఏదీ దాచుకోకుండానే చెప్పానన్నారు. అలానే.. తన వ్యక్తిగత ఆస్తుల వివరాలన్నీ ఐటీలోనూ ఉన్నాయన్నారు. ఆయా లెక్కలకు మించి ఒక్క అంగుళం భూమి తమ కుటుంబానికి ఉంటే.. ప్రభుత్వానికి తామే స్వయంగా అప్పగించేస్తామని కవిత పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వమే విచారించి స్వాధీనం చేసుకుంటామన్నా ఇచ్చేస్తామన్నారు. లేనిపోని అపవాదులు వేయడం సీఎం రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు.

ఇక, సీఎం రేవంత్ చెప్పిన బీఆర్‌ఎస్ నాయకుల భూములపై తక్షణమే విచారణకు ఆదేశించాలని కవిత కోరారు. ఆయా భూముల నిజానిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా కొందరు భూములు సంపాయించుకున్న విషయాన్ని తాను మొదటి నుంచి చెబుతున్నానని.. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచిందన్నారు.

అయినా.. ఇవి ప్రకటనలే. అరుపులు, కేకలతో (సీఎం) ఏమీ జరగదు. విచారణ పేరుకు మాత్రమే. నిజానికి భూములపై విచారణ జరగాలని మేం కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి.. విచారణకు ఆదేశించాలి. లేకపోతే.. ఆయా భూముల వద్దకు మా పార్టీ కార్యకర్తలు వెళ్లి నిరసన తెలుపుతారు అని కవిత పేర్కొన్నారు.

సిట్టింగ్ జడ్జితో విచారించాలి: హరీష్

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు నిప్పులు చెరిగారు. 22ఏ భూములు కేవలం 3 లక్షల ఎకరాలేనని నాలుగు రోజుల కిందట ఇదే ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ, ఇప్పుడు 30 లక్షల ఎకరాలని సీఎం చెబుతున్నారని అన్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ డొల్లతనం సీఎం ప్రకటనలోనే స్పష్టమైందన్నారు. ధరణి తీసేసి.. భూ భారతి తీసుకువచ్చారని.. కానీ, ఒకే జిల్లాలో 80 లక్షల రూపాయల స్కామ్ జరిగిందని.. దీనిని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

అన్ని విషయాలపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.