నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో… ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని అనంత్ అంబానీ చెప్పిన మాటలు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది.
అనంత్ అంబానీ…. పరిచయం చేయడం అక్కర్లేని పారిశ్రామికవేత్త . రిలయన్స్ అంబానీ వారసుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. లక్షల కోట్లకు అధిపతి. ఆయన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్ ప్రాజెక్టుతో పాటుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపనకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి అనంత్ అంబానీ అన్నమయ్య జిల్లా మదనపల్లికి వచ్చారు. ప్రతిష్టాత్మాకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దేశంలోనే మొట్ట మొదటిది కావడం గమనార్హం. రైతులకు అత్యాధునిక సాంకేతిక సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ అగ్రికల్చర్ స్కూల్ నిర్వహణ కు సంబందించి రిలయన్స్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రాజెక్టు శంఖుస్థాపన జరిగింది. దీనికి అనంత్ అంబానీ హాజరయ్యారు.
ఈ సందర్బంగా అనంత్ అంబానీ తనను తాను ఆంధ్రా బిడ్డగా పోల్చుకున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ అందమైన రాష్ట్రమని కితాబు ఇచ్చారు. మున్ముందు ఏపీ అభివృద్ధి విషయంలో భాగస్వామ్యం కావాలన్న ఆసక్తి కనబరిచారు. అనంత్ అంబానీ ప్రసంగంతో తెలుగు ప్రజల హృదయాలను చూరగొన్నారు. వేదిక మీద వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వెంటనే అనంత్ అంబానీని కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. అనంత్ ను తెలుగు బిడ్డ గా అభివర్ణించారు. ఈ కార్యక్రమం మొత్తంలో అనంత్ హైలెట్ గా నిలిచారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
