వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు సునీతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన సోదరుడు జగన్ హయాంలో తనకు న్యాయం జరగలేదని ఆమె పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇక, ఏకంగా తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేసిన ఆమె…జగన్ పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడిగా విచారణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డికి మరో షాక్ తగిలింది.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకు కొద్ది రోజుల ముందు జరిగిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈడీ నోటీసులిచ్చింది. వివేకా మర్డర్ కు ముందు జరిగిన రూ.40 కోట్ల డీల్ పై ఈడీ ఫోకస్ చేసింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఏ-7గా, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ-8గా ఉన్నారు. త్వరలో భాస్కర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులిచ్చి విచారణ జరిపే అవకాశాలున్నాయి.

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను ఈడీ అధికారులు ఆల్రెడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆ నలుగురిని పలు అంశాలపై ప్రశ్నించిన తర్వాత అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చిన వైనం చర్చనీయాంశమైంది. అయితే, ఈడీ విచారణకు అవినాష్ రెడ్డి హాజరువుతారా? ఒకవేళ హాజరైతే ఏం చెబుతారు? అన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.