చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మొదలు సూట్ బూట్ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టడం వరకు విజయ్ సినీ ఫక్కీలో చేసిన పనులపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే విజయ్ గాంధీ జయంతి సందర్భంగా బస్సులో కండక్టర్ అవతారమెత్తిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇక, స్వయంగా విజయ్ టికెట్లు కొట్టి ప్రయాణికులు ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయ్ విస్తరించారు. ఇకపై, ‘వెట్రి పయనం’ పథకం ద్వారా ఆర్డినరీతో పాటు ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్, మొఫుస్సిల్ బస్సులకు కూడా వర్తింపజేశారు. ఈ సందర్భంగా చెన్నైలో బస్సు ఎక్కి మహిళా ప్రయాణికులకు ఉచిత టికెట్లు పంపిణీ చేశారు విజయ్.

సీఎం సర్ ప్రైజ్ ఇవ్వడంతో బస్సులో మహిళలు..ముఖ్యంగా యువతులు, విద్యార్థినులు షాకయ్యారు. తమ అభిమాన నటుడు, సీఎం విజయ్ చేతుల మీదుగా టికెట్ తీసుకోవడంతో బాగా ఎగ్జయిట్ అయ్యారు. తమ దగ్గరున్న డైరీ మిల్క్ చాక్లెట్లను కొందరు యువతులు విజయ్ కు ఇచ్చి థ్యాంక్యూ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.