హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి రాత్రి హీరోలయ్యేవారు మరికొందరు. ఇలాంటి వారిలో తాజాగా విమాన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఓవర్ నైట్ ఆయన హీరో అయిపోయారు. ఒక్క మనదేశమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ కూడా.. మచ్చర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. దీనికి కారణం.. విధుల్లో ఆయన చూపిన ధైర్యసాహసాలే. ఇది ఏకంగా ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడేలా.. చేసింది.
ఏం జరిగింది?
సెప్టెంబర్ 30(రెండు రోజుల కిందట) దుబాయ్ నుండి ఇజ్రాయెల్ బయలుదేరిన విమానానికి(ఫ్లైదుబాయ్) స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే.. ఆయనతోపాటు విధుల్లో ఉన్న కో-పైలట్ అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ఇరువురి మధ్య ఏం జరిగిందనేది ప్రస్తుతానికి తెలియకపోయినా.. స్మిత్‌పై కో పైలట్ కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అయితే.. కత్తిపోట్లకు గురైనా వెనక్కి తగ్గకుండా పోరాడి, కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను, సిబ్బందిని స్మిత్ అప్రమత్తం చేశారు. దీంతో వివిధ దేశాలకు చెందిన 174 మంది ప్రయాణికుల ప్రాణాలను ఆయన రక్షించారు.
విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రాణనష్టాన్ని నివారించారు. ఒక వేళ అలా జరిగి ఉండకపోతే.. 174 మంది(సుమారు 30 దేశాలకు చెందిన వారని అంటున్నారు) ప్రాణాలు నేలమట్టం అయి ఉండేవి. ఇక, ఈ ఘటనలో మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోడీ సహా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభినందించారు.
మోడీ ప్రత్యేకంగా మచ్చర్‌కు ఫోన్ చేసి వీడియో కాల్‌లో మాట్లాడారు. మచ్ఛర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాక్‌పిట్‌లో తనకు ఎదురైన అత్యవసర పరిస్థితి గురించి మోడీకి స్మిత్ వివరించారు. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు మొత్తం చనిపోయే అవకాశం ఉందని భయపడినట్టు తెలిపారు. ఆ సమయంలో తను హన్‌మాన్ చాలీసాను పఠించినట్టు పేర్కొన్నారు. కో పైలట్ తనపై దాడిచేసిన తీరును ఆయన ప్రధానికి వివరించారు. కాగా.. విపత్కర పరిస్థితుల్లో కెప్టెన్ స్మిత్ చూపించిన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, భారత్ ప్రభుత్వం.. మచ్చర్‌కు అత్యున్నత అశోక చక్ర పురస్కారం అందించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
